తమిళసినిమా: బ్రెయిన్ చెప్పింది బ్లైండ్‌గా ఫాలో అయ్యే నటి శృతిహాసన్. విశ్వ నటుడు కమల్ హాసన్ వారసురాలు. అయినా ఈమె భావాలు వేరేగా ఉంటాయి. అయితే ఈమె తండ్రికి తగ్గ కూతురే. ఆయన మాదిరిగానే బహుముఖ ప్రజ్ఞ కలిగిన నటి. సంగీత దర్శకురాలిగా పరిచయమై, ఆ తర్వాత కథానాయకిగా, గాయకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
నటిగా ముందు బాలీవుడ్‌లో పరిచయమై, తర్వాత కోలీవుడ్, టాలీవుడ్‌ను దాటి హాలీవుడ్ స్థాయికి చేరుకున్నారు. తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఏళామ్ అరివు చిత్రానికి కథానాయకిగా పరిచయం అయ్యారు. అలా తొలి చిత్రంలోనే బలమైన పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు. అయితే ఎందుకనో శృతిహాసన్‌ను తమిళ చిత్ర పరిశ్రమ పెద్దగా ఆదరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఈమెకు చెప్పుకోదగ్గ మంచి విజయాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్‌లో శృతిహాసన్ కథానాయకిగా నటిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 22వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శృతిహాసన్ ఒక భేటీలో పేర్కొంటూ నటుడు ప్రభాస్‌కు ప్రాముఖ్యత ఇస్తూ రూపొందించిన చిత్రం సలార్ అని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ చిత్ర యూనిట్ తనను తనలానే ఉండేలా షూటింగ్‌ను అనుభవించేలా చేశారన్నారు. ఇది హిందీ చిత్రం డంకీ చిత్రానికి పోటీగా విడుదలవుతుండడం గురించి ఎలాంటి భయం లేదన్నారు. కారణం తమ చిత్రంపై తమకు నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హాలీవుడ్‌లో తాను నటిస్తున్న ది ఐ చిత్రం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. కాగా తనను కొందరు మంత్రగత్తె అంటూ తప్పుగా అర్థం చేసుకుంటారని, అయినా తాను దాన్ని గర్వంగానే భావిస్తానన్నారు. ఇకపోతే తన తండ్రి సలహాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తాయని, అయినప్పటికీ వాటిని తాను పాటించలేక పోతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment