తమిళసినిమా: తమిళ సినిమాకు మంచిరోజులు నడుస్తున్నాయి అని అన్నది ఎవరో తెలుసా? ఇంకెవరు సంచలన నటుడు శింబు. ఈ మాట ఆయనకే వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆ మధ్య వరుస ప్లాపులతో సతమతం అయిన శింబుకు మానాడు చిత్రం ఊపిరి పోసింది. ఆ తరువాత ఆయన నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. బాలీవుడ్ భామ సిద్ధిసిద్నానీ నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ గత సెప్టెంబర్ 15న విడుదల చేసింది.
గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందననే తెచ్చుకున్నా వసూళ్ల పరంగా చిత్ర యూనిట్‌ను ఖుషి చేసింది. ముఖ్యంగా శింబు ఖాతాలో మరో హిట్ చిత్రంగా నమోదు కావడంతోపాటు నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన వెందు తనిందదు కాడు చిత్రం రూ.60 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కాగా చిత్ర అర్ధ శతదినోత్సవం వేడుకను బుధవారం సాయంత్రం చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు శింబు మాట్లాడుతూ ఇప్పుడు తమిళ సినిమాకే గోల్డెన్ డేస్ నడుస్తున్నాయని అన్నారు.
కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రం నుంచి మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్, కన్నడ చిత్రం కాంతార నుంచి ఇటీవల విడుదలైన లవ్ టుడే చిత్రం వరకు ఉన్న అన్ని చిత్రాలు మంచి ఆదరణ పొందాయన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించాలనే కోరిక తో వస్తున్న దర్శకుల కలలను సాకారం చేసేలా తమిళ సినిమా వారిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను తన ఇమేజ్‌కు భిన్నంగా ముత్తు పాత్రగా మారి నటించిన గ్యాంగ్ స్టార్ కథా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, ఘన విజయాన్ని అందించారన్నారు.
నిర్మాత ఐసరి గణేష్ చిత్రాన్ని భారీగా నిర్మించారని, వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ తన సొంత సంస్థ లాంటిదన్నారు. గౌతమ్ మీనన్ చిత్రాన్ని కొత్తగా తెరపై ఆవిష్కరించారని చెప్పారు. తను కోరగానే చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించిన ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు అన్నారు. ఇది విజయోత్సవ వేడుకగా కాకుండా ఇందులో పనిచేసిన నటీనటులు సాంకేతిక వర్గాన్ని గౌరవించాలని భావించినట్లు నిర్మాత ఐసరి గణేష్ పేర్కొన్నారు. ఈ వేడుకలో ఉదయనిధి స్టాలిన్, ఆర్‌కే సెల్వమణి, ఉదయకుమార్, అరుళ్ మణి, ధనుంజయ్, శరత్ కుమార్, రాధిక పలువురు సినీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment