సాక్షి, హైదరాబాద్: గానమే ప్రాణమని.. ప్రాణమే గానమని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సినీ నేపథ్య గాయకుల్లోనే నూతన ఒరవడిని సృష్టించిన ఆయన గాత్రం శిఖరసమానం. అయిదు దశాబ్దాల పాటు సుమారు 18 భాషల్లో 45వేల పైచిలుకు గీతాలతో సినీ కళామతల్లికి స్వరాభిషేకం గావించిన మేరునగం. ఇటీవల అస్తమించిన ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని, ఈ పురస్కారానికి అన్నివిధాలా ఆయన అర్హులని డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బాలూకు భారతరత్న అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపాదించారు. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సినీ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇదొక మంచి నిర్ణయమని ‘సాక్షి’తో పేర్కొన్నారు.
భారతరత్న ఎప్పుడో ఇవ్వాల్సింది
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారికి ‘భారతరత్న’ అవార్డు ఎప్పుడో రావాల్సింది. ఆలస్యం అవ్వడం బాధగా ఉంది. ఆయన మరణం తర్వాత అటువంటి అవార్డుతో సత్కరించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఏపీ ప్రభుత్వంప్రతిపాదించడం నిజంగా అభినందనీయం. నాలుగు తరాల హీరోలకి సంగీతమందించిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు. పాట ప్రారంభించే ముందు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బాలు గారు నమస్కరించి పాట పాడటం మొదలుపెట్టేవారు.
– అనూప్‌రూబెన్స్, మ్యూజిక్ డైరెక్టర్
మంచి ప్రతిపాదన
దివంగత ఎస్పీ బాలు సార్‌కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన ఆహ్వానించదగిన నిర్ణయం. ఎస్పీబీ ఒక సంగీతంలోనే కాకుండా డబ్బింగ్‌లో, నటనలో సైతం తన ప్రతిభను 100 శాతం కనబర్చారు. గొప్ప మనసున్న వ్యక్తికి భారతరత్న పురస్కారం ఇవ్వడం మనమిచ్చే అరుదైన గౌరవం. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన ఎంతో సముచితం.
– సునీత, గాయని
100 శాతం అర్హులు
బిఫోర్ ఎస్పీ బాలు..ఆఫ్టర్ ఎస్పీ బాలు అనే స్థాయికి భారతీయ సంగీతాన్ని తీసికెళ్లిన మహనీయుడు ఎస్పీ బాలు గారు. భారతరత్నతో ఆయన్ని సత్కరించుకోవాలని కోరడం నిజంగా అభినందనీయం. ఆ అవార్డుకు బాలు గారు 100శాతం అర్హులు కూడా.
– భాస్కరభట్ల, పాటల రచయిత
చాలా సంతోషంగా ఉంది
ఎస్పీ బాలు గారికి భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన చాలా సంతోషమనిపించింది. ఇప్పటికే దీనిపై నేను ఓ ప్రతిపాదనపై సంతకం చేసి ఇతరులతో కూడా చేపించా. నిజంగా ఆయన్ని భారతరత్నతో సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది.
– కౌసల్య, సింగర్
గాయకుల దిక్సూచి
ఎస్పీ బాలు గారి హాయాంలో పాటలు పాడే భాగ్యం కలిగినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నాలాంటి ఎందరో యంగ్ సింగర్స్‌కి ఆయనో దిక్సూచి. అంతగొప్ప వ్యక్తిని ‘భారతరత్న’తో సత్కరించుకోవాలి. ఇటువంటి గొప్ప ఆలోచన ఏపీ ప్రభుత్వానికి రావడం నిజంగా హ్యాపీ..
– సమీర భరద్వాజ్, సింగర్.
పురస్కారంతో సత్కరించుకోవాలి
బాలు గారికి ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రతిపాదించడం వంద శాతం ఆహ్వానించదగ్గ నిర్ణయం. బాలు గారు ఒక లెజండరీ. అటువంటి వ్యక్తిని మనం అంతటి గొప్ప పురస్కారంతో సత్కరించుకోవాల్సిందే.
– రాహుల్ సిప్లిగంజ్, సింగర్
అది మన బాధ్యత
వేలపాటలు పాడిన గొప్ప గాయకుడు బాలుగారిని భారతరత్నతో సత్కరించుకోవడం మన బాధ్యత కూడా. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ పురస్కారానికి ఆయన నిజంగా అర్హులు. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.
– అంజన సౌమ్య, సింగర్
Comments
Please login to add a commentAdd a comment