
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్. ఒకపక్క పెద్ద సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క చిన్న చిత్రాలతో అదరగొడుతోంది. సరికొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తూ.. విజయాలను అందుకుంటుంది.తాజాగా మరో కొత్త కాంబినేషన్‌తో సినిమాని ప్రకటించింది. అదే ‘90s’, ‘బేబీ’ కాంబినేషన్.
'బేబీ' చిత్రంతో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda), వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. అలాగే '90s' వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు యువ సంచలనాలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments), తమ ప్రొడక్షన్ నెం. 32ని ప్రకటించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. '90s' సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు. "మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ." అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుంది.
తన మధురమైన మెలోడీలతో ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రకటన వీడియోతోనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు ఆదిత్య హాసన్, 'బేబీ' ద్వయంతో కలిసి మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment