ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘అమరన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
సినిమా అన్నది మనకి చాలావరకు వినోద సాధనం మాత్రమే. కొన్ని సినిమాలు వినోదంతోపాటు విషయ విశ్లేషణను అందిస్తే మరికొన్ని మాత్రం మనకు స్ఫూర్తిదాయకమవుతాయి. అటువంటి ప్రత్యేకమైన సినిమానే ‘అమరన్’. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు దేశభక్తి, లేక సైనికులకు సంబంధించిన సినిమాలు చూసి నిజంగా మనం ఇప్పటిదాకా ఏమైనా స్ఫూర్తి పొందామా అన్న విషయం ఆలోచించుకోవాలి. ప్రతిరోజూ మనకి కరెంట్ పోతేనో లేక టైమ్‌కి ఫుడ్ అందకపోతేనో లేదంటే సినిమాకి టికెట్లు దొరక్కపోతేనో ఎంతో చిరాకు పడిపోతాం.
కానీ కనురెప్ప మూసినా, రోజుల తరబడి ఆహారం అందకపోయినా అనుక్షణం ప్రమాదం పొంచి ఉన్నా విపరీత వాతావరణ పరిస్థితుల్లో కూడా తమ వారందరికీ దూరంగా తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్న మన సైనికుల కష్టం నేడు ఎంత మందికి తెలుసు. ఓ సైనికుడు తన ము΄్పాతిక భాగం జీవితాన్ని డ్యూటీలోనే గడిపేస్తాడట. అలాగే తన కుటుంబాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యూటీ చేసేవాడు సైనికుడు. అటువంటి సైనికుడి కథే ఈ ‘అమరన్’. ఇదో వాస్తవ గాథ. తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ 2014 సంవత్సరం ఏప్రిల్ 25న వీరమరణం పొందారు. అప్పటినుండి దేశమంతా ఆయన పేరు మార్మోగిపోయింది.
అసలెవరీ ముకుంద్, అతను సైనికుడు ఎలా, ఎందుకు అయ్యాడు? అన్నదే ఈ ‘అమరన్’ సినిమా. 44 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన ఇతడు 2006 లెఫ్టినెంట్ స్థాయిలో ఉన్న ముకుంద్ ఆరేళ్ల లోపే మేజర్ స్థాయికి ఎదిగాడంటే అతని సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్‌పాత్రకు ప్రాణం పోశారు. ఆయనకు జోడీగా సాయి పల్లవి నటించారు. ఆమె కూడా తనదైన శైలిలో అద్భుతంగా నటించారు. మంచి స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా మనల్ని కాసేపు మేజర్ జీవితంతో ప్రయాణ అనుభూతినిస్తుంది.
ఈ సినిమాలో ముకుంద్ ధైర్యసాహసాలు, తెగువకు మించి అతని సైనిక స్ఫూర్తిని ఎంతో సవివరంగా చూపించారు దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ‘అమరన్’ తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రతిక్షణం మన కోసం తన వాళ్లని వదులుకుని ప్రాణత్యాగానికైనా వెనుకాడని మన అమర వీరుల దినోత్సవం అయిన ఈ జనవరి 30న కనీసం ఓ సెల్యూట్ అయినా చేద్దాం, అలాగే అందరితో చేయిద్దాం. ఎందుకంటే అంతటి అసమాన వీరులకు మనం ఇచ్చే చిన్నపాటి కృతజ్ఞత ఇదే. – ఇంటూరి హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment