
‘‘సారంగపాణి జాతకం’ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్... ఇలా అన్ని రకాల అంశాలుంటాయి. ఇంద్రగంటికథ చెప్పినప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. జంధ్యాలగారితో పూర్తి స్థాయిలో ఓ వినోదాత్మక చిత్రం నిర్మించాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇంద్రగంటిగారితో చేసిన ఈ వినోదాత్మక చిత్రంతో ఆ లోటు తీరిపోయింది. కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.
అలా ఈ సినిమా కూడా చాలా కాలం పాటు గుర్తుంటుంది’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా శివ లెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ–‘‘జెంటిల్‌మ్యాన్, సమ్మోహనం’ వంటి చిత్రాల తర్వాత ఇంద్రగంటిగారు,నా కాంబోలో ‘సారంగపాణి జాతకం’తో హ్యాట్రిక్ హిట్ సాధించనున్నాం. ఫ్యామిలీతో పాటుగా యూత్ ని కూడా మా చిత్రం మెప్పిస్తుంది.
‘కోర్ట్’ మూవీలో సీరియస్‌గా కనిపించిన ప్రియదర్శి మా సినిమాలో నవ్విస్తారు. ‘వెన్నెల’ కిశోర్, వైవా హర్ష, వీకే నరేశ్, అవసరాల శ్రీనివాస్ పాత్రలు నవ్విస్తాయి. జంధ్యాలగారి కామెడీ, ఈవీవీ సత్యనారాయణగారి స్టైల్, ఇంద్రగంటి మార్క్‌తో ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీశాం. అప్పట్లో మేం ఒక హీరోతో చేసిన తర్వాత ఇంకో హీరోతో సినిమాను ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టులని లైన్ లో పెడుతున్నారు.
కాంబినేషన్స్ చుట్టూ తిరుగుతూ కథల గురించి పట్టించుకోవడం లేదు. నాకు సినిమాల పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. అందుకే నా మార్క్ కనిపించాలని కోరుకుంటున్నాను. నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. ‘యశోద’ చిత్ర దర్శకులు హరి–హరీష్ చెప్పిన రెండు కథలు, అలాగే పవన్ సాధినేని చెప్పిన కథ నాకు నచ్చాయి. మోహనకృష్ణ ఇంద్రగంటిగారితో ఇంకో సినిమా కూడా చేయబోతున్నాను’’ అన్నారు.