టైటిల్ : సోలో బ్రతుకే సో బెటర్
జానర్ : రొమాంటిక్ కామెడీ
నటీనటులు : సాయితేజ్, నభా నటేశ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, రావు రమేష్, నరేష్, సత్య తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ
నిర్మాత : బీవియస్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం : సుబ్బు
సంగీతం : తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : వెంకట్ సి.దిలీప్
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేది : డిసెంబర్ 25, 2020
మెగా వారసుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన హీరో సాయి తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తేజ్ ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ జోష్‌ను ఇలాగే కొనసాగించాలని ఆచి, తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి కామెడీనే నమ్ముకొని కొత్త దర్శకుడితో ప్రయోగం చేశాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ డిఫెరెంట్ టైటిల్‌తో ముందుకు వచ్చాడు. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.
ఇక లాక్‌డౌన్ తరువాత థియేటర్లలో విడుదలవుతోన్న ఫస్ట్ బిగ్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ కు ఇండస్ట్రీలోని స్టార్లు అంతా సపోర్ట్ చేశారు. సినిమాకి వచ్చే రెస్పాన్స్ చూసి మిగిలిన సినిమాలను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సాయి తేజ్ సినిమా కోసం వాళ్లతోపాటు మిగిలిన వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? సుప్రీం హీరో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాడా లేదా? భారీ ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఏ మేరకు నిలబెట్టాయి? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ప్రేమ, పెళ్లి లొల్లి లేకుండా బతుకాలనుకునే విద్యార్థి విరాట్ (సాయి తేజ్). మన రాజ్యాంగం మనకు స్వేచ్చగా బతకమని కొన్ని హక్కులను ఇస్తే, వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్స్‌తో నాశనం చేస్తున్నామని తెగ బాధపడిపోతాడు. తన స్నేహితులు ఇలా నాశనం కాకూడదని, జనాలకు ఈ నిజాన్ని తెలియజేయాలని ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఫౌండేషన్‌ని స్థాపించి యువతకు గీతోపదేశాలు ఇస్తాడు. అబ్దుల్ కలాం, ఆర్ నారాయణ మూర్తి, అటల్ బిహారి వాజ్‌పేయిలను ఆదర్శంగా తీసుకొని స్వేచ్ఛగా బతికేద్దామని యువతకు పిలుపునిస్తాడు. అంతే కాదు.. మామయ్య వేణు(రావు రమేష్) మద్దతుతో పెళ్లి చేసుకుంటే పడే కష్టాలు ఏంటో, సోలోగా ఉంటే జరిగే లాభాలేంటో తెలియజేయడానికి 108 శ్లోకాలతో పుస్తకాన్ని రాసి ప్రచారం చేస్తాడు.
ఇక విరాట్ శ్లోకాలు విన్న కొంతమంది యువకులు.. ప్రేమ, పెళ్లి పక్కన పెట్టి సోలోగా బతికేస్తారు. విరాట్ కూడా తన సిద్దాంతాలకు కట్టుబడి.. తనకు ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయిని చులకన చేసి మాట్లాడుతాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వస్తాడు. స్నేహితులతో కలిసి బ్రహ్మచారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తన స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవడంతో విరాట్ ఒంటరివాడు అవుతాడు. ఇక తను గట్టిగా నమ్మిన ఆర్ నారాయణ మూర్తి కూడా మనిషి ప్రకృతి ధర్మం పాటించాలని, పెళ్లి చేసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో చెబుతాడు. అది విన్న విరాట్.. రియలైజ్ అవుతాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన స్నేహితుడి పెళ్లికి వెళతాడు. ఇక పెళ్లి కూతురు అమృత(నభా నటేశ్) విరాట్‌ను చూసి, తన పెళ్లి ఆపేసుకుంటుంది. పెళ్లంటూ చేసుకుంటే విరాట్‌నే చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పేస్తుంది. విరాట్ కూడా అమృతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అమృత.. విరాట్‌కు అనుకోని షాక్ ఇస్తుంది? ఆ షాక్ ఏంటి? పెళ్లి కోసం అతను పడిన పాట్లు ఏంటి? తను చెప్పిన సిద్దాంతాలే తనకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టాయనేదే మిగతా కథ
నటీనటులు
పెళ్లి అంటే ఇష్టంలేని విరాట్ పాత్రలో సాయితేజ్ ఒదిగి పోయాడు. కామెడీతో ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా పండించాడు. డైలాగ్ మాడ్యులేషన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ చాలా బాగున్నాయి. అమృత పాత్రకు నభా నటేశ్ 100 శాతం న్యాయం చేసింది. యాక్టింగ్‌లో సాయి తేజ్‌తో పోటి పడింది. విరాట్ మామయ్యగా రావు రమేష్ మరోసారి తదైన ముద్రవేశాడు. వెన్నెల కిషోర్ కామెడీ కాస్త తగ్గినా బాగుంది. ఇక విరాట్ ఫ్రెండ్‌గా సత్య కొంత మేర నవ్వించాడు. హీరో హీరోయిన్ల తండ్రులుగా నరేష్, రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తమ అనుభవంతో అవలీలగా చేసుకుంటూ పోయారు. విలన్‌గా అజయ్ తన పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
వాస్తవానికి పెళ్లి అంటే ఇష్టంలేని హీరోల కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. మొదట్లో పెళ్లి వద్దనుకుంటారు తర్వాత హీరోయిన్ చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సినిమాలు బోలెడన్ని వచ్చాయి. ఇక డైరెక్టర్ సుబ్బు కూడా ఈ రూల్స్‌ని బ్రేక్ చేయలేదు. కానీ చూపించే విధానం మాత్రం కాస్త కొత్తగా ఉంది. కామెడీతోనే ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. మనిషికి తోడు అవసరమని, భాగస్వామి లేకుంటే ఎదురయ్యే ఇబ్బందులేంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే హీరో అలా బ్రహ్మచారిగా ఉండాలని ఎందుకు డిసైడ్ అయ్యాడో కారణం చెప్పలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌తో లాగేశారు. హీరో హైదరాబాద్‌కు రావడం, ఫ్రెండ్స్ మారిపోయి పెళ్లి చేసుకోవడం, హీరో రియలైజ్ అయి పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్నీ చకచకా జరిగిపోతాయి.
ఇక ఇంటర్వెల్ ముందు హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం అంతగా ట్విస్ట్‌లేమి ఉండవు. తర్వాత ఏం జరగబోతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించగలడు. ఇక హీరో,హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. వెన్నెల కిషోర్ కామెడీని కాస్త పెంచితే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సైతం సింపుల్‌గా ఉండటం కొంచెం మైనస్ అయిందని చెప్పొచ్చు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ మ్యాజిక్ చేశాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే..‘సోలో బ్రతుకే సో బెటర్’ కామెడీగా ఓ మంచి సందేశాన్ని ఇచ్చింది.
ప్లస్ పాయింట్
సాయితేజ్ యాక్టింగ్
ఇంటర్వెల్ ట్విస్ట్
సంగీతం
రావు రమేష్ పాత్ర
మైనస్ పాయింట్
సెకండాఫ్ సాగదీత సీన్లు
ఎమోషనల్ సీన్లు పండకపోవడం
సింపుల్ క్లైమాక్స్
అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment