Solo Brathuke So Better Movie
-
దారుణం: ఐసియూలో బెడ్ దొరక్క డైరెక్టర్ సుబ్బు తల్లి మృతి
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ దర్శకుడు సుబ్బు ఇంట విషాదం నెలకొంది. మే 16న ఆయన తల్లి కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా పరీక్షించి సుబ్బు తల్లి మంగమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆదివారం ఆస్పత్రికి తరలించారు. అక్కడి ఆస్పత్రి ఐసీయూలో బెడ్ దొరకకపోవడంతో సమయానికి ఆక్సిజన్ అందక ఆరోగ్యం విషమించి మంగమ్మ తుది శ్వాస విడిచారు. అయితే సుబ్బు ‘సోలో బ్రతుకే సో బెటర్’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా భారత సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక-నిర్మాతలు ఎంతోమంది కరోనా కన్నుమూస్తున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన సీనియర్ నటుడు గౌతమ్ రాజు తమ్ముడు సిద్ధార్థ ఆక్సిజన్ కొరతతో మరణించిన సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్ పియా బాజ్ పేయి సోదరుడు కూడా ఆక్సిజన్ దొరక్క మరణించాడు. సామాన్య ప్రజలు నుంచి సెలబ్రిటిల వరకు కరోనా సెకండ్ వేవ్ దాటికి అల్లాడిపోతున్నారు. చదవండి: 'అసురన్' నటుడు మృతి -
లాక్డౌన్ తర్వాత రిలీజైన తొలి పెద్ద సినిమా గుర్తుందా?
గతేడాది వేసవి, దసరా, దీపావళి పండగలు సినిమాల సందడి లేకుండా వెళ్లిపోయాయి. సంవత్సరాంతంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు ఆరంభమయ్యాయి. పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి. ఆ బాధ్యతను ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ తీసుకుంది. సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? వసూళ్లు ఏమాత్రం ఉంటాయి? వంటి సందేహాల నడుమ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పెద్ద సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా వాస్తవానికి గత మేలో విడుదల కావాల్సింది. లాక్డౌన్ వల్ల వాయిదా పడి, డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చింది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ కూడా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. అప్పటినుంచి మెల్లిగా సినీ పరిశ్రమ తేరుకుని, సినిమాల విడుదలకు ముందుకొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి మంచి వసూళ్లతో టాలీవుడ్ కోలుకున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. -
దయచేసి టికెట్ ధర పెంచొద్దు
‘‘థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు. సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్‌ను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్‌గారు, వైఎస్ జగన్‌గారు థియేటర్స్ ఓపెన్ చేయడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో ఎవరూ టికెట్ ధర పెంచవద్దని నా మనవి. రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు? టికెట్ ధర పెంచడానికి కేసీఆర్‌గారు, వైఎస్ జగన్‌గారు ఒప్పుకోవద్దని కోరుతున్నాను’’ అన్నారు నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి. సాయితేజ్, నభా నటేశ్ జంటగా సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘సాయితేజ్‌గారు ఓ సోదరుడిలా నాకు అండగా నిలబడి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆర్. నారాయణమూర్తిగారు ఇచ్చిన ఇంటర్వ్యూని వాడుకున్నాను. ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడుగార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు సుబ్బు. ‘‘ఈ సినిమా రిలీజ్ అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ఓ మార్గదర్శకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇండస్ట్రీ మొత్తం చేసిన సపోర్ట్‌కి అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. సాయితేజ్ మాట్లాడుతూ – ‘‘కోవిడ్ ప్రభావంతో అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయపడ్డాం. అదే సమయంలో జీ స్టూడియో వారు అడిగితే, ప్రొడ్యూసర్‌గారికి లాభాలు రావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యి.. అప్పటికి సినిమా ఓటీటీలో విడుదల కాలేదంటే అప్పుడు థియేటర్స్‌లోనే విడుదల చేద్దామనే అనుకున్నాం. థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన రెండు తెలుగు ప్రభుత్వాలకు మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులు వస్తారో, రారోనని టెన్షన్ పడ్డాం. కానీ వచ్చి మా సినిమాను ఆశీర్వదించారు. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. -
‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
-
‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ రివ్యూ
టైటిల్ : సోలో బ్రతుకే సో బెటర్ జానర్ : రొమాంటిక్ కామెడీ నటీనటులు : సాయితేజ్, నభా నటేశ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, రావు రమేష్, నరేష్, సత్య తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ నిర్మాత : బీవియస్‌ఎన్ ప్రసాద్ దర్శకత్వం : సుబ్బు సంగీతం : తమన్ ఎస్ సినిమాటోగ్రఫీ : వెంకట్ సి.దిలీప్ ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : డిసెంబర్ 25, 2020 మెగా వారసుడిగా చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన హీరో సాయి తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తరువాత తడబడ్డాడు. కథల ఎంపికలో పొరపాట్లతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి తేజ్ ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాలతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ జోష్‌ను ఇలాగే కొనసాగించాలని ఆచి, తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి కామెడీనే నమ్ముకొని కొత్త దర్శకుడితో ప్రయోగం చేశాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ డిఫెరెంట్ టైటిల్‌తో ముందుకు వచ్చాడు. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక లాక్డౌన్ తరువాత థియేటర్లలో విడుదలవుతోన్న ఫస్ట్ బిగ్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ కు ఇండస్ట్రీలోని స్టార్లు అంతా సపోర్ట్ చేశారు. సినిమాకి వచ్చే రెస్పాన్స్ చూసి మిగిలిన సినిమాలను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సాయి తేజ్ సినిమా కోసం వాళ్లతోపాటు మిగిలిన వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది? సుప్రీం హీరో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాడా లేదా? భారీ ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఏ మేరకు నిలబెట్టాయి? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ ప్రేమ, పెళ్లి లొల్లి లేకుండా బతుకాలనుకునే విద్యార్థి విరాట్ (సాయి తేజ్). మన రాజ్యాంగం మనకు స్వేచ్చగా బతకమని కొన్ని హక్కులను ఇస్తే, వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్స్‌తో నాశనం చేస్తున్నామని తెగ బాధపడిపోతాడు. తన స్నేహితులు ఇలా నాశనం కాకూడదని, జనాలకు ఈ నిజాన్ని తెలియజేయాలని ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఫౌండేషన్‌ని స్థాపించి యువతకు గీతోపదేశాలు ఇస్తాడు. అబ్దుల్ కలాం, ఆర్ నారాయణ మూర్తి, అటల్ బిహారి వాజ్‌పేయిలను ఆదర్శంగా తీసుకొని స్వేచ్ఛగా బతికేద్దామని యువతకు పిలుపునిస్తాడు. అంతే కాదు.. మామయ్య వేణు(రావు రమేష్) మద్దతుతో పెళ్లి చేసుకుంటే పడే కష్టాలు ఏంటో, సోలోగా ఉంటే జరిగే లాభాలేంటో తెలియజేయడానికి 108 శ్లోకాలతో పుస్తకాన్ని రాసి ప్రచారం చేస్తాడు. ఇక విరాట్ శ్లోకాలు విన్న కొంతమంది యువకులు.. ప్రేమ, పెళ్లి పక్కన పెట్టి సోలోగా బతికేస్తారు. విరాట్ కూడా తన సిద్దాంతాలకు కట్టుబడి.. తనకు ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయిని చులకన చేసి మాట్లాడుతాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వస్తాడు. స్నేహితులతో కలిసి బ్రహ్మచారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తన స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవడంతో విరాట్ ఒంటరివాడు అవుతాడు. ఇక తను గట్టిగా నమ్మిన ఆర్ నారాయణ మూర్తి కూడా మనిషి ప్రకృతి ధర్మం పాటించాలని, పెళ్లి చేసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో చెబుతాడు. అది విన్న విరాట్.. రియలైజ్ అవుతాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన స్నేహితుడి పెళ్లికి వెళతాడు. ఇక పెళ్లి కూతురు అమృత(నభా నటేశ్) విరాట్‌ను చూసి, తన పెళ్లి ఆపేసుకుంటుంది. పెళ్లంటూ చేసుకుంటే విరాట్‌నే చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పేస్తుంది. విరాట్ కూడా అమృతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అమృత.. విరాట్‌కు అనుకోని షాక్ ఇస్తుంది? ఆ షాక్ ఏంటి? పెళ్లి కోసం అతను పడిన పాట్లు ఏంటి? తను చెప్పిన సిద్దాంతాలే తనకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టాయనేదే మిగతా కథ నటీనటులు పెళ్లి అంటే ఇష్టంలేని విరాట్ పాత్రలో సాయితేజ్ ఒదిగి పోయాడు. కామెడీతో ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగా పండించాడు. డైలాగ్ మాడ్యులేషన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ చాలా బాగున్నాయి. అమృత పాత్రకు నభా నటేశ్ 100 శాతం న్యాయం చేసింది. యాక్టింగ్‌లో సాయి తేజ్‌తో పోటి పడింది. విరాట్ మామయ్యగా రావు రమేష్ మరోసారి తదైన ముద్రవేశాడు. వెన్నెల కిషోర్ కామెడీ కాస్త తగ్గినా బాగుంది. ఇక విరాట్ ఫ్రెండ్‌గా సత్య కొంత మేర నవ్వించాడు. హీరో హీరోయిన్ల తండ్రులుగా నరేష్, రాజేంద్రప్రసాద్ ఎప్పటిలాగే తమ అనుభవంతో అవలీలగా చేసుకుంటూ పోయారు. విలన్‌గా అజయ్ తన పరిధి మేరకు నటించారు. విశ్లేషణ వాస్తవానికి పెళ్లి అంటే ఇష్టంలేని హీరోల కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. మొదట్లో పెళ్లి వద్దనుకుంటారు తర్వాత హీరోయిన్ చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సినిమాలు బోలెడన్ని వచ్చాయి. ఇక డైరెక్టర్ సుబ్బు కూడా ఈ రూల్స్‌ని బ్రేక్ చేయలేదు. కానీ చూపించే విధానం మాత్రం కాస్త కొత్తగా ఉంది. కామెడీతోనే ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. మనిషికి తోడు అవసరమని, భాగస్వామి లేకుంటే ఎదురయ్యే ఇబ్బందులేంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే హీరో అలా బ్రహ్మచారిగా ఉండాలని ఎందుకు డిసైడ్ అయ్యాడో కారణం చెప్పలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్తో లాగేశారు. హీరో హైదరాబాద్‌కు రావడం, ఫ్రెండ్స్ మారిపోయి పెళ్లి చేసుకోవడం, హీరో రియలైజ్ అయి పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక ఇంటర్వెల్ ముందు హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం అంతగా ట్విస్ట్లేమి ఉండవు. తర్వాత ఏం జరగబోతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించగలడు. ఇక హీరో,హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. వెన్నెల కిషోర్ కామెడీని కాస్త పెంచితే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సైతం సింపుల్‌గా ఉండటం కొంచెం మైనస్ అయిందని చెప్పొచ్చు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ మ్యాజిక్ చేశాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే..‘సోలో బ్రతుకే సో బెటర్’ కామెడీగా ఓ మంచి సందేశాన్ని ఇచ్చింది. ప్లస్ పాయింట్ సాయితేజ్ యాక్టింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్ సంగీతం రావు రమేష్ పాత్ర మైనస్ పాయింట్ సెకండాఫ్ సాగదీత సీన్లు ఎమోషనల్ సీన్లు పండకపోవడం సింపుల్ క్లైమాక్స్ అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మిస్టరీ ఆరంభం
ఒకపక్క ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలతో ఫుల్ బిజీగా ఉండి కూడా గురువారం తన నూతన చిత్రాన్ని ప్రారంభించారు సాయితేజ్. ‘సోలో బ్రతుకే...’ చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో చేసిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లేను సమకూరుస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాయితేజ్ క్లాప్‌నిచ్చారు. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి, కుమారుడు సుక్రాంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ కార్తీక్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. -
‘నో పెళ్లి..’ సాంగ్ పెద్ద సౌండ్‌తో పెడతా..
‘‘ఈ లాక్డౌన్ ఒక్కసారి ఆగి, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల పక్షులు సందడి చేస్తాయో ఈ లాక్‌డౌన్‌లోనే గమనించాను. బిజీ లైఫ్‌లో ఎంత గందరగోళంగా బతుకుతున్నానో నాకప్పుడు అర్థం అయ్యింది’’ అన్నారు సాయి తేజ్. సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభా నటేశ్ జంటగా బీవియస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయితేజ్ చెప్పిన విశేషాలు. ► కరోనా లాక్డౌన్ తర్వాత విడుదలవుతున్న పెద్ద తెలుగు సినిమా మీదే! కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారంటారా? సాయితేజ్: సినిమా ప్రేమికులు కచ్చితంగా వస్తారు. ఎందుకంటే సినిమాను థియేటర్లో చూసే ఎక్స్‌పీరియన్స్‌ను ఇన్ని రోజులు మిస్సయ్యాం. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకి ధైర్యం నింపటం కోసం ‘టెనెట్’ సినిమా విడుదలవ్వగానే నేను థియేటర్లో చూశాను. నా తోటి హీరోలు, దర్శకులు చాలామంది థియేటర్‌కి వెళ్లి, సినిమాను థియేటర్లోనే చూడమని మోటివేట్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా మొదట మే1న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా కారణంగా వాయిదా వేశాం. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని సినిమాలో ఎందుకంటున్నారు? కాలేజీలో చదివే ఒక యంగ్ బోయ్ తన ఫ్రెండ్స్‌కి సోలో లైఫ్ వల్ల లాభాలేంటని చెప్పే సినిమా ఇది. ఫ్రెష్‌గా కాలేజీ నుండి బయటకు వచ్చేవాళ్లను హీరో ఎలా ఇన్స్పైర్ చేశాడనేది సినిమా. ఆ క్రమంలో అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వాటినుండి ఎలా బయటపడ్డాడు అనేది కథ. యూత్‌ఫుల్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ యాంగిల్‌ని ఎమోషనల్‌గా బాగా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రతి ఫ్యామిలీకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ► ఈ సినిమా మీ జీవితానికి ఏమైనా దగ్గరగా ఉందా? ఈ సినిమానే కాదు.. గతంలో చేసిన ‘చిత్రలహరి’,‘ ప్రతిరోజూ పండగే’ సినిమాలను కూడా నా లైఫ్‌కి ఎంతో దగ్గరగా ఫీలయ్యాను. ఈ సినిమా అయితే మరీ దగ్గరగా ఉంటుంది. కారణం బ్యాచ్‌లర్‌ని కావటమే. సోలోగా ఉండాలని మనం ఎలా కోరుకుంటామో, పిల్లలకు పెళ్లి కావాలని పెద్దవాళ్లూ అంతే గట్టిగా కోరుకుంటారు. ఫైనల్‌గా వాళ్లే గెలుస్తారు. మా ఇంట్లో రోజూ సుప్రభాతం తర్వాత ‘నో పెళ్లి..’ సాంగ్ పెద్ద సౌండ్‌తో పెడతాను. ఆ టైమ్‌లో మా అమ్మని కాఫీ అడిగితే నా వైపు ఓ చూపు చూసి ‘నువ్వే పెట్టుకో’ అంటుంది (నవ్వుతూ). ► పిల్లలకు పెళ్లవ్వాలని పెద్దవాళ్లు బలంగా కోరుకుంటారని అన్నారు.. మరి.. మీ పెళ్లెప్పుడు? పెళ్లి చేసుకుంటే ‘ఇంటికి ఎప్పుడొస్తావ్? ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్?’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలి. అదే సోలోగా ఉంటే, మహా అయితే అమ్మ ఫోన్ చేసి ‘తిన్నావా?’ అని ఒకసారి అడుగుతుంది. ‘తిన్నానమ్మా’ అంటే మళ్లీ ఫోన్ రాదు. మా అమ్మ కోసం, ఇంట్లో వాళ్ల కోసం పెళ్లికి ఓకే అన్నా. కానీ 2020లో షూటింగ్‌లకు గ్యాప్ రావటం వల్ల చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కమిట్ అయిన సినిమాలు అవ్వగానే చూడాలి. ► లాక్డౌన్ ఏమైనా నేర్పించిందా? ఓర్పు, సహనంతో పాటు కృతజ్ఞత అనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. మనం ఒక ప్లాన్‌లో ఉంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. దానికి తగ్గట్టు మనం ఎలా నడుచుకోవాలి? మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. వాటర్ బాటిల్స్ పట్టడం ఎంత కష్టమో లాక్డౌన్ బాగానే నేర్పించింది (నవ్వుతూ). ► కరోనా సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. వాటివల్ల సినిమా పరిశ్రమకు నష్టమా? కరోనాతో నష్టపోయిన సినిమా పరిశ్రమ ఇప్పట్లో కోలుకుంటుంది అనుకుంటున్నారా? ఇండస్ట్రీ డబుల్ స్పీడ్‌లో రికవర్ అవుతుందని నా నమ్మకం. ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. అలాగే ఇప్పుడు సినిమాలు చేసేవారు ఎంతో బాధ్యతతో చేస్తారు. ప్రొడక్షన్ వేల్యూస్‌ను పెంచుకుంటూ నటీనటుల దగ్గర నుండి వంద శాతం నటనను రాబట్టుకొని సినిమాలు చేస్తారు. మనకు ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో అప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాం. పోటీ మంచిదే. ► కొత్త సంవత్సరం సందర్భంగా మీరు తీసుకునే నిర్ణయాల గురించి..? 2020లో నేర్చుకున్న విషయాలను అమలు చేయాలనుకుంటున్నాను. పరిగెడుతున్న కాలం ఒక్కసారిగా ఆగిపోయినా ధైర్యం కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. జీవితం ఆగిపోయిందే అనుకోకుండా దమ్ముగా, ధీటుగా ముందుకెళ్లాలి. మనతోపాటు ప్రకృతి బతకాలి. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణి పొల్యూషన్ లేకుండా బతకడానికి అవకాశం ఇవ్వాలి. మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనేది నా నూతన సంవత్సరం రిజల్యూషన్ అనుకోవచ్చు.