దయచేసి టికెట్‌ ధర పెంచొద్దు | R Narayana Murthy Speech At Solo Brathuke So Better Thanks Meet | Sakshi
Sakshi News home page

దయచేసి టికెట్‌ ధర పెంచొద్దు

Published Wed, Dec 30 2020 12:07 AM | Last Updated on Wed, Dec 30 2020 5:27 AM

R Narayana Murthy Speech At Solo Brathuke So Better Thanks Meet - Sakshi

సుబ్బు, నభా నటేశ్, సాయి తేజ్, ఆర్‌.నారాయణమూర్తి, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌

‘‘థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు. సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ టీమ్‌ను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్‌గారు, వైఎస్‌ జగన్‌గారు థియేటర్స్‌ ఓపెన్‌ చేయడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలకు ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో ఎవరూ టికెట్‌ ధర పెంచవద్దని నా మనవి. రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు? టికెట్‌ ధర పెంచడానికి కేసీఆర్‌గారు, వైఎస్‌ జగన్‌గారు ఒప్పుకోవద్దని కోరుతున్నాను’’ అన్నారు నటుడు–దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి.

సాయితేజ్, నభా నటేశ్‌ జంటగా సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో ఆర్‌. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘సాయితేజ్‌గారు ఓ సోదరుడిలా నాకు అండగా నిలబడి ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఆర్‌. నారాయణమూర్తిగారు  ఇచ్చిన ఇంటర్వ్యూని వాడుకున్నాను. ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడుగార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు సుబ్బు.  ‘‘ఈ సినిమా రిలీజ్‌ అనేది ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకే ఓ మార్గదర్శకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇండస్ట్రీ మొత్తం చేసిన సపోర్ట్‌కి  అందరూ అభినందిస్తున్నారు’’ అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. 

సాయితేజ్‌ మాట్లాడుతూ – ‘‘కోవిడ్‌ ప్రభావంతో అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయపడ్డాం. అదే సమయంలో జీ స్టూడియో వారు అడిగితే,  ప్రొడ్యూసర్‌గారికి లాభాలు రావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం. అయితే థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యి.. అప్పటికి సినిమా ఓటీటీలో విడుదల కాలేదంటే అప్పుడు థియేటర్స్‌లోనే విడుదల చేద్దామనే అనుకున్నాం. థియేటర్స్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన రెండు తెలుగు ప్రభుత్వాలకు మా టీమ్‌ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులు వస్తారో, రారోనని టెన్షన్‌ పడ్డాం. కానీ వచ్చి మా సినిమాను ఆశీర్వదించారు. అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement