పెళ్లి తర్వాత సినిమాలు మానేసిన హీరోయిన్లు ఎంతోమంది. అలాంటి హీరోయినే సోనియా అగర్వాల్ కూడా. తను దేనికోసమైతే, తన స్టార్‌డమ్‌ను దూరం చేసుకుందో ఆ బంధమే విడిపోతే, అందరిలా చింతించలేదు. పోగొట్టుకున్న స్టార్‌డమ్‌ను సాధించుకునే ప్రయత్నం చేసింది. ఫలితంగా వరుస సినిమాలు, సిరీస్‌లతో దూసుకుపోతోంది.
చండీగఢ్‌లో పుట్టిన సోనియా మాతృ భాష పంజాబీ. స్కూల్‌కెళ్లే రోజుల్లోనే సీరియల్స్‌లో నటించి, హీరోయిన్ కావాలనుకుంది. ‘7/జీ బృందావన్ కాలనీ’ చిత్రంతో తెలుగు నాట అనితగా గుర్తిండిపోయిన సోనియా, నిజానికి 2000లోనే ‘నీ ప్రేమకై’, ‘ధమ్’ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ, రెండూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో తమిళ ఇండస్ట్రీకి మకాం మార్చింది.
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాదల్ కొండేన్’తో మొదటి హిట్ కొట్టడమే కాదు, ‘ఉత్తమ నూతన నటిగా ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ పురస్కారం’ కూడా అందుకుంది. తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే దర్శకుడు సెల్వ రాఘవన్‌ను వివాహమాడి సినిమాలకు స్వస్తి పలికింది. అయితే, విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయింది. తర్వాత, తిరిగి తన అభినయ కళతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
హీరోయిన్‌గానే కాకుండా తల్లి, అక్క, సహాయ పాత్రలకు ప్రిఫరెన్స్ ఇస్తూ వరుసగా ‘డిటెక్టివ్ సత్యభామ’, ‘టెంపర్’, ‘శాసనసభ’ సినిమాల్లో నటించింది. మొదట్లో కెరీర్ కాస్త తడబడ్డా, ప్రస్తుతం పలు సినిమా, సిరీస్ అవకాశాలతో బిజీగా మారింది. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘ఫాల్’ వెబ్ సిరీస్‌తో అలరిస్తోంది. గతం అనేది నేర్చుకోవడానికే కానీ, దానితో పాటు కరిగిపోవడానికి కాదు. అందుకే, గతం నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక్కటైనా నేర్చుకుంటారు. – సోనియా అగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment