చండీఘర్: కరోనా వైరస్ ప్రభావంతో కష్టాలు పడుతున్న వారికి అండగా నిలుస్తున్న ఒకేఒక్క వ్యక్తి నటుడు సోనూసూద్. తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల సినిమా ప్రేక్షకులకు తెలిసిన సోనూ కరోనా అనంతరం పేదలకు సహాయం చేస్తూ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. రియల్ హీరోగా పేరుపొందిన సోనూ ఇప్పుడు మరోసారి గొప్ప సహాయం చేశారు.
తాజాగా తన సొంత గ్రామం పంజాబ్‌లోని మోగా పట్టణంలో 8 మంది నిరుద్యోగులకు సహాయం చేశారు. వారి ఉపాధి కోసం ఆ 8 మందికి ఈ-రిక్షాలు అందించారు. తన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్‌తో కలిసి నిరుద్యోగులకు రిక్షాలను ఇచ్చారు. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నట్లు సోనూసూద్ మీడియాతో చెప్పారు. ఈ విధంగా చేయడంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి అని పిలుపునిచ్చారు. తాను తన తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నట్లు పేర్కొన్నారు. తాను దేవుణ్ని కాదని అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ తన బాధ్యత నిర్వర్తిస్తున్నట్లు సోనూసూద్ తెలిపారు. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో సోనూసూద్ నటించి నవ్వులు పూయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment