Sonu Sood Love Story: 'ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న', 'మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడప దాటవు'.. ఇప్పుడు ఈ రెండెందుకు అంటారా? అక్కడికే వస్తున్నాం.. కొందరు మేమున్నాం, సాయం చేస్తాం అంటూ బడాయిలు పోతుంటారు, రియాలిటీకి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తుంటారు. కానీ సోనూసూద్ అలా కాదు, తను ఏమాత్రం ప్రగల్భాలు పలకకుండానే కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలబడతాడు. సాయం కోసం చేయి చాచిన వారి అవసరాలు తీరుస్తాడు. కరోనా కాలంలో అన్ని వర్గాల ప్రజలకు చేతనైనంత సాయం చేసి ఎంతోమందికి ప్రత్యక్ష దైవంగా మారాడు సోనూసూద్. నేడు(జూలై 30న) అతడి బర్త్‌డే. ఒక చేతితో చప్పట్లు మోగవు, అలాగే అతడు చేసే మంచిపనుల్లోనూ భార్య సోనాలి ప్రోత్సాహం ఉండక మానదు. మరి సోనూసూద్ బర్త్‌డే సందర్భంగా అతడి లవ్‌స్టోరీని చదివేద్దాం..
అవి సోనూసూద్ ఇంజనీరింగ్ చదివే రోజులు. అతడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సోనాలి ఎంబీఏ చేస్తోంది. చదువే వాళ్లిద్దరినీ కలిపింది. మొదట స్నేహితులయ్యారు. తర్వాత ఇద్దరి అభిరుచులు కలవడంతో ఇరువురి మధ్య బంధం మరింత పెనవేసుకుపోయింది. అది కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. ఈ ప్రేమను పెద్దల ఆశీస్సులతో 1996లో పెళ్లిపీటలెక్కించారిద్దరూ. తర్వాత సోనాలి ఓ కంపెనీలో జాబ్ చేయగా సోనూసూద్ మోడలింగ్ చేశాడు.
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉండటంతో వీళ్లిద్దరూ తమ ఫ్రెండ్ చూపించిన చిన్న గదిలో, వేరేవాళ్లతో కలిసి నివసించారు. ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎంత కష్టాలు అనుభవించినా సర్దుకుపోయారే తప్ప ఎప్పుడూ ఎవరినీ నోరు తెరిచి సాయం అడగలేదు. వీరి కష్టాలకు చెక్ పెడుతూ సోనూసూద్ 199లో నటనారంగంలోకి అడుగుపెట్టాడు. అయితే సినిమాల్లోకి రావాలని సోనూసూద్ తీసుకున్న నిర్ణయంతో సోనాలి తొలుత కొంత బాధపడింది, కానీ తర్వాత అతడి ఇష్టాన్ని అర్థం చేసుకుని మద్దతుగా నిలబడింది. ఇప్పుడు అతడు అంచెలంచెలుగా ఎదిగి రీల్‌లో విలన్‌గా రియల్ లైఫ్‌లో హీరోగా ప్రశంసలు అందుకోవడాన్ని చూసి ఉప్పొంగిపోతోంది. ఇంతకీ సోనాలి ఎవరో కాదు, మన తెలుగమ్మాయే!
Comments
Please login to add a commentAdd a comment