బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే కన్నడ హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర సహా మొత్తం 17 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కోపంతో అభిమాని రేణుకాస్వామిని చంపిన దర్శన్‌పై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.
తిడతారని తెలుసు
అయితే కొందరు మాత్రం దర్శన్‌నే వెనకేసుకొస్తున్నారు. తాజాగా నటి సోను గౌడ ఆ జాబితాలోకి చేరింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు నన్ను ఎంతోమంది తిడతారని నాకు తెలుసు. కానీ ఒక్కసారి అభిమానం పెంచుకున్నాక అది ఎల్లప్పటికీ అలాగే ఉంటుంది. నేను దర్శన్‌కు అభిమానిని. ఆయన వల్ల లాభం పొందిన ఎంతోమంది ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. చాలామంది ఆయన్ను మోసం చేశారు కానీ ఆయన ఎన్నడూ ఇతరుల్ని మోసగించలేదు.
అమాయకుల జీవితం జైల్లో..
ఏ పాపం చేయకపోయినా నన్ను కూడా ఓసారి జైల్లో వేశారు. నేను మాట్లాడాల్సిన సమయం వచ్చిందనే పెదవి విప్పాను. ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను. చాలామంది అమాయకుల జీవితం కూడా జైల్లోనే గడిచిపోతుంది. నిజంగా తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడాల్సిందే! దర్శన్‌కు తమ్ముడిని, అన్నను, అంకుల్‌ను అంటూ చెప్పుకుతిరిగినవారంతా ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు.
అదే ఆయన్ను కాపాడుతుంది
పరిస్థితులు ఎలా ఉన్నా సరే దర్శన్‌కు సపోర్ట్ చేయడం నా బాధ్యత. దర్శన్ చిత్తశుద్ధే ఆయన్ను కాపాడుతుంది అని చెప్పుకొచ్చింది. కాగా సోను శ్రీనివాస గౌడ.. కన్నడ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొంది. ఆ మధ్య ఎనిమిదేళ్ల చిన్నారిని దత్తత తీసుకుని వార్తల్లో నిలిచింది. నిబంధనలు పాటించకుండా చిన్నారిని దత్తత తీసుకోవడంతో పాటు, ఆ పాపను పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని పోలీసులు సోనును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నటి బెయిల్‌పై బయటకు వచ్చింది.
చదవండి: కల్కి మూవీ.. ఇంతలా అరిచి ఎన్నాళ్లయిందో: రేణు దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment