సాక్షి, చెన్నై: నాలుగు దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం దివికేగారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి ఆయన పేరు సుపరిచితం. విదేశాల్లో ఉన్న అభిమానుల కోసం ఆయన ఎన్నో కచేరీలు చేసి అలరించారు. ప్రాంతమేదైనా తన వద్దకు వచ్చే అభిమానులను ప్రేమతో పలకరించడం ఆయన ప్రత్యేకత. అనుకోని అతిథిగా వెళ్లి కొన్నిసార్లు వారిని సంభ్రమాశ్చర్యంలోనూ ముంచెత్తుతారు. రేవతి అనే ట్విటర్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ వీడియో బాలు స్వచ్ఛమైన మనసుని కళ్లకు కడుతోంది.
ఆ వీడియోప్రకారం.. శ్రీలంకలో జరిగిన ఓ పేలుడు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన వ్యక్తి కంటి చూపు కోల్పోయారు. దాదాపు ఆరు మాసాలు ఆస్పత్రికే పరిమితమైన సమయంలో ఎస్పీబీ పాటలే తనకు సాంత్వన నిచ్చాయని, బాలుకు తాను వీరాభిమానిని అని అతను ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. బాలు దైవంతో సమానమని, ఆయన్ని ఒక్కసారి కలుసుకుంటే జన్మ ధన్యమవుతుందని ఆకాక్షించారు.
ఈ నేపథ్యంలో అతని ఫ్రెండ్స్ కొందరు బాలుకి విషయం చెప్పడంతో.. ఆయన కలిసేందుకు సరేనన్నారు. బాలు పాడిన తమిళపాటను ఆ అభిమాని హమ్ చేస్తున్న సమయంలో ఆయన వెళ్లి గొంతు కలిపారు. నా గొంతు కూడా బాలు గొంతులాగే ఉంటుందని బాలు కాసేపు ఆట పట్టించారు. తర్వాత.. ‘నా పేరు బాలు. ఎస్పీ బాలు. నేను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం’ అని చెప్పడంతో.. ఆ అభిమాని ఒకింత ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు. ఊహించని ఘటనతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ‘నిన్ను కలుసుకునేందుకే వచ్చాను’అని బాలు చెప్పారు.
(చదవండి: బాలు మృతికి సంతాపంగా నయన్ భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment