టైటిల్: స్పార్క్
నటీనటులు: విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్, నాజర్ తదితరులు
నిర్మాత: విక్రాంత్
రచన-దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: విక్రాంత్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
విడుదల తేది: 2023 నవంబర్ 17
(ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?)
స్కార్క్ కథేంటంటే?
లేఖ(మెహరీన్) కలలోకి ప్రతి రోజు ఓ వ్యక్తి వస్తుంటాడు. దీంతో ఆమె అతన్నే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. స్నేహితులతో కలిసి అతని కోసం వెతుకుతుంటుంది. ఓ ఆస్పత్రిలో అనుకోకుండా అతన్ని చూస్తుంది. అతనే ఆర్య(విక్రాంత్ రెడ్డి). లేఖ ఎదురింట్లోనే ఉంటాడు. అతన్ని ప్రేమలో పడేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆర్య మాత్రం లేఖ ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. నగరంలో వరుసగా అమ్మాయిలు చనిపోతుంటారు. సడెన్‌గా సైకోలుగా మారి తమ కుటుంబ సభ్యులను చంపి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ హత్యలకు కారణం ఆర్యనే అని లేఖ తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్) ఆరోపిస్తాడు.
పోలీసులు కూడా అతని కోసం గాలిస్తుంటారు. అసలు సిటీలో జరుగుతున్న హత్యలకు కారణం ఎవరు? అమ్మాయిలు సడెన్‌గా సైకోలుగా ఎందుకు మారుతున్నారు? ఆర్యకు ఈ మర్డర్లతో ఉన్న సంబంధం ఏంటి? వైజాగ్‌కు చెందిన జై.. ఆర్యగా పేరు మార్చుకొని హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లాడు? యువతుల మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? జై ప్రియురాలు అనన్య(రుక్సార్ థిల్లాన్) ఎలా చనిపోయింది? ఈ మర్డర్లతో ఇండియన్ ఆర్మీలో పనిచేసే డాక్టర్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఇదో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. దానికి ట్రయాంగిల్ లవ్‌స్టోరీని జోడించారు. ఫస్టాఫ్‌లో ఒకపక్క హీరోహీరోయిన్లతో లవ్‌ట్రాక్ నడిపిస్తూనే.. మరోపక్క వరుస హత్యలు చూపిస్తూ ఆసక్తిని పెంచేశాడు దర్శకుడు. హత్యలకు సంబంధించిన సన్నివేశాలు భయంకరంగా ఉంటాయి. లవ్‌ట్రాక్ మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. నాజర్,గురు సోమసుందరం పాత్రల ఎంట్రీ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది.
ఎదుటి మనిషిలోని మెదడును కంట్రోల్ చేసే ప్రయోగం సఫలం అయితే జరిగే అనార్థాలను గురించి ఇందులో చర్చించారు. హత్యలతో సంబంధం ఉన్నవారిని గుర్తించేందుకు హీరో చేసే ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తది. పాన్ ఇండియా సబ్జెక్టు. ఇలాంటి భారీ కథకు స్టార్ హీరో అయితే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే?
విక్రాంత్ కొత్తవాడే అయినా.. తన పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే.. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆర్య, జై పాత్రల్లో చక్కగా నటించాడు. కొన్ని చోట్ల నటనలో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ విషయంలో విక్రాంత్ ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. లేఖ పాత్రలో మెహరిన్ ఒదిగిపోయింది. ఇక హీరో ప్రియురాలు అనన్యగా రుక్సార్ చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. విలన్‌గా గురు సోమసుందరం తనదైన నటనతో మెప్పించాడు. సుహాసినీ మణిరత్నం సరికొత్త పాత్రలో నటించింది.
నాజర్, రాహుల్ రవీంద్ర, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. హేషం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో ప్రతి సీన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment