Srikanth Reveals His Role In Ram Charan And Shankar Movie - Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌-శంకర్‌ సినిమాలో నన్ను చూసి షాకవుతారు: శ్రీకాంత్‌

Published Sun, Jan 23 2022 3:03 PM | Last Updated on Sun, Jan 23 2022 7:44 PM

Srikanth Reveals His Role In Ram Charan And Shankar Movie - Sakshi

విలన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత వరుస కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా మారాడు శ్రీకాంత్‌. కొన్నాళ్ల పాటు హీరోగా పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు సపోర్టింగ్‌ యాక్టర్‌గానూ రాణించాడు. ఇక బోయపాటి, బాలకృష్ణ హ్యాట్రిక్‌ మూవీ ‘అఖండ’తో మళ్లీ విలన్‌గా మారాడు శ్రీకాంత్‌. ఈ సినిమాలో మైనింగ్‌ మాఫియా లీడర్‌ వరదరాజులుగా శ్రీకాంత్ విలనిజానికి మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖండ గురించి, వరదరాజులు పాత్ర గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘సరైనోడు సినిమాలో నటిస్తున్న సమయంలోనే బోయపాటి శ్రీను నన్ను పిలిచి విలన్‌ క్యారెక్టర్‌లో నటిస్తారా అని అడిగారు. దానికి నేను ఓకే చెప్పా. అయితే అప్పటి వరకు చిన్న చిన్న సినిమాల్లో నటించొద్దని చెప్పారు. యుద్ధం శరణం సినిమాలో విలన్‌గా చేశాను. అది చాలా మంచి సినిమా.. కానీ విజయం సాధించలేదు.

ఆ తర్వాత విలన్‌ పాత్రలు వచ్చినా.. నేను ఒప్పుకోలేదు. బోయపాటి పిలిచి వరదరాజులు క్యారెక్టర్‌ గురించి చెప్పారు. అది నాకే కొత్తగా అనిపించింది. కచ్చితంగా నాకు గుర్తింపు వస్తుందని అనుకున్నాను. కానీ అఖండ సినిమా మాత్రం ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు. వరదరాజులు క్యారెక్టర్‌... నేను విలన్‌గా చెయ్యొచ్చుననే కాన్ఫిడెంట్‌ని ఇచ్చింది’అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్‌. ఇక  రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నా పాత్రను చూసి ప్రతి ఒక్కరు షాకవుతారు. ఇతను శ్రీకాంతేనా? అని అనుకుంటారు. తెరపై కొత్త శ్రీకాంత్‌ని చూస్తారు’అన్నారు. మరి ఈ పాత్ర ద్వారా శ్రీకాంత్‌ ఎలా మెప్పిస్తారో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement