శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల కేఎఫ్‌సీ పాప్‌కార్న్ నాచోస్‌కు సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీనిధి శెట్టితో సాక్షి డిజిటల్ ప్రతినిధి రేష్మి స్పెషల్ ఇంటర్వ్యూ...
ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అందాల పోటీల వరకు ఇదంతా ఎలా జరిగింది?
అందాల పోటీల్లో పాల్గొనాలని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే, ప్రతిదానికీ సమయం ఉందని పెద్దలు చెప్పంది నిజమని నేను భావిస్తాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు తొలి ప్రాధాన్యత కుటుంబమే. అందుకే వారు చెప్పినట్లే మొదట నా చదువును పూర్తి చేశాకే అందాల పోటీలు, తర్వాత సినిమాల కోసం ప్రయత్నించాలని అనుకున్నాను.
సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు?
నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ, కేజీఎఫ్‌లో నటించాలని ప్లాన్ చేసింది కాదు. నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు అనేక పత్రికల్లో వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నిజం చెప్పాలంటే, ఆ ఆడిషన్ తర్వాత నాకు ఈ పాత్ర వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆడిషన్‌లో నా పర్ఫామెన్స్ ఆయనకు నచ్చి.. నేనే ఆ పాత్రకు సూట్ అవుతానని అనుకున్నారు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు కేజీఎఫ్‌లో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి సినిమాలోని నా నటనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఎంతో సంతోషిస్తున్నా.
మీరు కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా ?
అస్సలు అనుకోలేదు. సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. కేజీఎఫ్ విడుదలైన తర్వాతే అర్థమైంది మేము ఎంత పెద్ద హిట్ కొట్టామో. ప్రేక్షకుల ప్రేమకు, దేవుని ఆశీస్సులకు ధన్యవాదాలు.
అన్ని బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది?
నా మొదటి సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక కేజీఎఫ్ 2 రూ. 1000 కోట్లు దాటింది. మేము ఇలాంటి విజయం సాధించినందుకు, టీమ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంది.
ఇలాంటి భారీ సినిమా కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఒప్పుకుంటే ఇతర అవకాశాలు కోల్పోతామనే భయం కలిగిందా ?
అలాంటి రిస్క్ తీసుకోడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్లు పడుతుందనే విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ఏ కళాకారుడికైనా ఎన్ని రోజులు చేశామనేది కాకుండాల ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని నేను భావిస్తాను.
మీరు స్టార్‌గా మారడం చూసిన మీ స్నేహితులు ఎలా స్పందించారు?
నేను నటిని మాత్రమే. నన్ను నేను స్టార్‌గా పరిగణించను. నా స్నేహితులు కూడా అలా చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఒకేలా ట్రీట్ చేస్తారు. వారే నాకు పెద్ద అభిమానులు, నా పెద్ద విమర్శకులు కూడా.
యష్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?
యష్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా అంకితభావం, ఏకాగ్రత ఉన్న వ్యక్తి. అతను తన పని చేసుకుంటూనే మనం మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపిస్తాడు. అతనితో నేను కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.
దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పండి.
ప్రశాంత్ నీల్‌తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన చాలా సౌమ్యుడు, దయగలవారు. అలాగే ఆయనకు తన నటీనటుల నుంచి ఏం కావలన్నదానిపై పూర్తి స్పష్టత ఉంది. దాని వల్ల నటీనటుల నుంచి ఉత్తమ నటనను బయటకు తీసుకురాగలరు.
సినిమా అనేది ఎల్లలు దాటేసింది. మరి మీరు ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారా?
నేను భారతీయ సినిమాను ఒక పరిశ్రమగా పరిగణిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను.
మీరు ఇటీవల కేఎఫ్‌సీ కోసం ఒక ప్రకటన చేశారు. దాని గురించి చెప్పండి. ప్రకటనలకు, చలనచిత్రాల షూటింగ్‌కు ఏ మేరకు తేడా ఉంటుంది?
కేఎఫ్‌సీతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. ఎందుకంటే నేను కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక నా వరకు అయితే ప్రకటనలు, చలనచిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. నిజానికి, 1-2 రోజులలో షూట్ చేసే యాడ్ ఫిల్మ్‌లతో పోలిస్తే సినిమాలకు చాలా ఎక్కువ సమయం, నిబద్ధత, నెలలు అవసరం. సమయం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చేసే కృషి మాత్రం ఒకే విధంగా ఉంటుంది.
మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా ? మీరు ఇటీవల ఏ తెలుగు సినిమా చూశారు?
అవును, నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. నిజానికి, నేను సినిమా పిచ్చిదాన్ని. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. నేను చూసిన చివరి తెలుగు సినిమా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'.
కేజీఎఫ్ చాప్టర్ 3 నిజంగా ఉంటుందా ?
నాకు తెలియదు. అది మీరు దర్శకనిర్మాతలను అడగాలి. కానీ కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొనసాగుతుందని, దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను.
మీ తదుపరి చిత్రాలు, పాత్రల గురించి చెప్పండి.
చాలా ప్రాజెక్ట్‌లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఇంకా ఓకే చేయలేదు.
ప్రాంతీయ భాషల్లోని సినిమాలు భారతదేశంలో పాన్ ఇండియా చిత్రాలుగా మారి చాలా ప్రశంసలు పొందాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా?
నిజానికి ఇది చాలా కాలం క్రితమే జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చాలా ఎక్కువ ఎక్స్‌పోజర్‌ని కలిగి ఉన్నారు. అలాగే వారు అన్ని రకాల చిత్రాలను వీక్షిస్తున్నారు, అభినందిస్తున్నారు.
పాన్ ఇండియా సినిమాలతో అతిపెద్ద ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు?
ప్రేక్షకులు! ఎప్పుడు కూడా చివరి ఫలితం ప్రేక్షకులే. పాన్ ఇండియా చిత్రాల ద్వారా మీరు అనేక మంది ప్రేక్షకులకు చేరువవుతారు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మీరు ఏమనుకుంటున్నారు?
నా అభిప్రాయం ప్రకారం ఓటీటీ ఒక అద్భుతమైన వేదిక. వివిధ రకాల పాత్రలు, జానర్‌లతో ప్రయోగాలు చేయడానికి కళాకారులకు, అన్ని రకాల బడ్జెట్‌లతో పని చేసే దర్శకులకు ఇది అవకాశాలను కల్పిస్తోంది.
వెబ్ సిరీస్‌ల్లో మీరు నటించే అవకాశం ఉందా ?
పని ఎక్కడ నుంచి వస్తుందని నేను ఆలోచించను. నేను ఇష్టపడే స్క్రిప్ట్‌పై పని చేయడం, నేను ఉన్నతంగా నటిస్తున్నానా లేదా అని చూడటం, అందుకు సహాయపడే బృందంతో పని చేస్తున్నానా లేదా అని చూడటమే నాకు ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment