అలనాటి హీరోయిన్ శ్రీవిద్య పేరు 1970లో వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1953న 24 జూలై జన్మించిన శ్రీవిద్య 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించింది. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత మలయాళంలో తొలి అవకాశం వచ్చింది. 1971లో 'నోట్రుకు నురు' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఏడాదిలోనే ‘ఢిల్లీ టు మద్రాస్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాతమనవడు చిత్రంతో అరంగేట్రం చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా సినిమాల్లో నటించింది. అప్పటి హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా నిలిచింది.
కుటుంబ నేపథ్యం
శ్రీ విద్య తండ్రి కృష్ణమూర్తి తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడు.. తల్లి వసంతకుమారి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలోనే శ్రీవిద్య తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కుటుంబ పోషణకై ఆమె తల్లి కూలి పనికి వెళ్లేది. అప్పట్లో అమ్మకు కనీసం పాలివ్వడానికి కూడా సమయం సరిపోలేదని గతంలో శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
వైవాహిక జీవితం
శ్రీవిద్య సినిమాల్లో నటిస్తుండాగనే.. తమిళస్టార్ హీరో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే కమల్ హాసన్ మరో హీరోయిన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు భరతన్‌తో శ్రీవిద్య ప్రేమాయణం కొనసాగించినా.. ఆ బంధంఎక్కువ కాలం నిలవలేదు. చివరికీ మాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జార్జ్ థామస్‌ని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకుంది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
భర్త వేధింపులు
పెళ్లయిన తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని భర్త జార్జ్ షరతు పెట్టాడట. దీంతో శ్రీవిద్య పెళ్లికి ముందే బాప్టిజం పూర్తి చేసింది. పెళ్లి తర్వాత కూడా భర్త బలవంతం వల్లే మళ్లీ నటనలో అడుగుపెట్టింది. అయినప్పటికీ జార్జ్ శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు భరించలేక 1980లో విడాకులు తీసుకుని జార్జ్‌తో బంధానికి ముగింపు పలికింది.
విడాకులిచ్చినా భర్త వదల్లేదు
విడాకుల తర్వాత శ్రీవిద్య నటనలో కొనసాగింది. అయితే విడాకుల తర్వాత కూడా శ్రీవిద్యను జార్జ్ వదల్లేదు. ఆమె ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టులో శ్రీ విద్య విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీవిద్య చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడింది.
క్యాన్సర్‌తో మరణం
2003లో శ్రీవిద్యకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. తాను చనిపోవడానికి 2 నెలల ముందు శ్రీవిద్య తన బంధువు సహాయంతో ఓ ట్రస్టు స్థాపించి.. ఆస్తినంతా పేద విద్యార్థులకు చదువు, సంగీతం, నాట్యం కోసం కేటాయించేలా వీలునామా రాసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కళాకారులను ఆదుకోవాలని వీలుమానాలో వెల్లడించింది. అంతేకాదు తన సోదరుడి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది.
క్యాన్సర్‌తో చివరికి శ్రీవిద్య 19 అక్టోబర్ 2006న మరణించగా.. తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్, భర్త వేధింపులు, చివరికీ క్యాన్సర్‌తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment