దక్షిణాదిలోని సుప్రసిద్ధ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ఆయన ‘దృశ్యం’ దర్శకుడు జీతూ జోసెఫ్‌ని ప్రశంసించడం విశేషం. మలయాళ చిత్రాలు ‘దృశ్యం, దృశ్యం 2’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీతూ జోసెఫ్. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘దృశ్యం 2’ ఫిబ్రవరి 19న అమెజాన్‌లో విడుదలై మంచి హిట్ అందుకుంది. ‘దృశ్యం’ రీమేక్‌లో నటించిన వెంకటేష్ ‘దృశ్యం 2’ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి వాట్సాప్ ద్వారా జోసెఫ్‌తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు జోసెఫ్. రాజమౌళి ప్రశంస ఏంటంటే.. ‘‘హాయ్ జీతూ.. నేను డైరెక్టర్ రాజమౌళిని. ‘దృశ్యం 2’ చూసిన తర్వాత నా ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయి. వెంటనే మళ్లీ ఒకసారి మలయాళ ‘దృశ్యం’ చూశాను. (తెలుగులో విడుదల అయినప్పుడే చూశాను). దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్.. ఇలా అన్ని విభాగాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కథ ఇది. ‘దృశ్యం’ ఒక మాస్టర్ పీస్. అదే ఉత్కంఠతో సీక్వెల్ తీసుకురావడం గొప్ప విషయం. మీ నుంచి మరికొన్ని మాస్టర్ పీస్ చిత్రాలు రావాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment