సాధారణంగా దర్శకుడు రాజమౌళితో చేసే చిత్రాల కోసం హీరోలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం రాజమౌళియే శిక్షణ తీసుకుంటున్నారట. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఇటీవలి కాలంలో ఏఐని సినిమా ఇండస్ట్రీ కథ మేరకు వినియోగించుకుంటోంది. ఆల్రెడీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏఐని వారి సినిమాల్లో ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కూడా ఫిల్మ్ మేకింగ్‌లో ఏఐ తెచ్చిన మార్పులను గురించి నేర్చుకోవడానికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్లాసుల కోసం ఆయన విదేశాల్లోని ఓ ప్రముఖ స్టూడియోతో అసోసియేట్ అయ్యారని భోగట్టా. ఇక మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు.
ఈ సినిమా కోసమే రాజమౌళి ఏఐను స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నట్లుగా ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల వెల్లడించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్ అన్వేషణలో కార్తికేయ (రాజమౌళి తనయుడు) ఉన్నారని తెలిసింది. ఇక ఈ చిత్రం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఉంటుందని, రెండు భాగాలుగా విడుదలవుతుందని, ‘మహా రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి.
‘ఆర్‌ఆర్‌ఆర్’ను మించి..!
‘ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం) సినిమాలోని ఇంట్రవెల్ సీన్‌లో లెక్కలేనన్ని జంతువులు కనిపిస్తాయి. కాగా మహేశ్‌బాబుతో తాను చేయనున్న సినిమాలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ కంటే ఎక్కువ యానిమల్స్‌ని ప్రేక్షకులు చూస్తారని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment