‘‘రవితేజగారితో ఫలానా జానర్ సినిమా చేయాలని ముందుగా అనుకోలేదు. రైటర్ శ్రీకాంత్ చెప్పిన కథ రవితేజగారికి నచ్చ డంతో దర్శకునిగా నేనైతే బావుంటుందని నా వద్దకు పంపించారు. థ్రిల్లర్ జానర్‌లో ‘రావణాసుర’ వంద శాతం కొత్త మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు’’ అని డైరెక్టర్ సుధీర్ వర్మ అన్నారు.
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ వర్మ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’లో థ్రిల్స్, షాకింగ్, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అందులో ఏది ముందు చెప్పినా సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఆ థ్రిల్ ఉండదు.. వారికి ఆ అనుభూతిని ఇవ్వడానికే కథ గురించి చెప్పడం లేదు.
అయితే సినిమా చూసిన తర్వాత మన భావోద్వేగాలు మిస్సయిన ఫీలింగ్ ఆడియన్స్‌కి రాదని నా నమ్మకం. ‘రావణాసుర’ పూర్తిగా రవితేజగారి సినిమా. నటన పరంగా ఆయన సినిమాల్లో టాప్ త్రీలో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే రవితేజగారు ఓ నిర్మాతగా వ్యవహరించారు. అభిషేక్‌గారితో నేను చేసిన రెండో సినిమా ‘రావణాసుర’. నాపై నమ్మకంతో ఆయన సెట్స్‌కే రారు. ‘సుధీర్ ఏం అడిగితే అది ఇచ్చేయండి’ అని యూనిట్‌కి చెబుతారు.
‘అంతం’ మూవీలో నాగార్జునగారి, ‘సత్య’లో జేడీ చక్రవర్తిగారి పాత్రల్లో గ్రే షేడ్స్ ఉంటాయి. అయితే హీరోలని గ్రే షేడ్స్‌లో చూపించడం ఈ మధ్య ఎక్కువ అయింది. మణిరత్నంగారి ‘రావణ్’ సినిమాకి, మా ‘రావణాసుర’కి ఎలాంటి సంబంధం లేదు. ‘రావణాసుర’ని హిందీ, తమిళ్‌లో విడుదల చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. తెలుగులో విడుదలైన రెండో వారం నుంచి హిందీలో ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి కథతో పవన్ కల్యాణ్‌గారితో నేను ఓ సినిమా చేసే అవకాశం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment