
సొమ్ము ఒకడిది సోకు మరొకనిది అనే సామెత తెలుసు కదా.. ఇది చిత్ర పరిశ్రమకు బాగా సూట్ అవుతుంది. కష్టపడి పని చేసేది ఒకరు అయితే క్రెడిట్ కొట్టేసిది మరొకరు. కనీసం స్క్రీన్‌పై వాళ్ల పేర్లను కూడా వేయడానికి ఇష్టపడని వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ డైరెక్టర్ సుకుమార్ ఇందుకు విరుద్దం. తనతో పని చేసిన టీమ్ మొత్తానికి క్రెడిట్ ఇస్తాడు. అది కూడా ఏదో ఇవ్వాలి కదా అన్నట్లు కాకుండా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తుంటాడు. తనదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసిన వారి టాలెంట్‌ని ప్రపంచానికి తెలియజేయడానికి ఆరాటపడతుంటాడు. సమయం దొరికినప్పుడల్లా వారి ప్రతిభ గురించి మాట్లాడుతుంటాడు. తాజాగా పుష్ప 2 సక్సెస్ మీట్‌లో కూడా సుకుమార్ తన టీమ్ గురించి గొప్పగా మాట్లాడాడు.
పుష్ప 2 విజయం వెనుక తన టీమ్ కష్టం చాలా ఉందని గర్వంగా చెప్పాడు. టీమ్ మొత్తాన్ని స్టేజ్‌పైకి పిలిచి ఒక్కొక్కరు చేసిన వర్క్, వారి ప్రతిభ గురించి చెబుతూ.. పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ వారికే ఇచ్చాడు. అంతేకాదు ‘పుష్ప 2 సినిమాకు నేను దర్శకుడిని కాదు.. వీళ్లంతా దర్శకులే. పొరపాటున నా పేరు వేసుకున్నా..’అని సుకుమార్ చెప్పడం నిజంగా ఆయనకు ఉన్న సంస్కారానికి నిదర్శనం.
‘మూడు గంటల పాటు ప్రేక్షకులు మా సినిమాను చూడాలని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాల్లో ఓ సన్నివేశం రాసే వాళ్లు నా దర్శకత్వ టీమ్‌లో ఉన్నారు. నా టీమ్‌లోని వారంతా సుకుమార్‌లే.. అందరూ నాలాంటి దర్శకులే. ఈ విజయానికి కారణం చిత్రబృందం అందరిదీ’అని సుకుమార్ చెబుతుంటే.. వెనుక ఉన్న టీమ్‌తో పాటు ముందున్న బన్నీ కళ్లు కూడా చెమ్మగిల్లాయి.
ఓ సినిమా మాములుగా హిట్ అయితేనే ఆ క్రెడిట్ అంతా తనదే అని చెప్పుకుంటారు కొంతమంది దర్శకులు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో సహాయం చేసిన వారి పేర్లను కూడా స్క్రీన్‌పై పడకుండా జాగ్రత్తపడతారు. మరికొంతమంది బడా దర్శకులు అయితే.. తన అసిస్టెంట్స్ దర్శకత్వం వహించిన సినిమాలకు కూడా తన పేరే వేయించుకుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందించి, ఆ క్రెడిట్ తన టీమ్‌కి ఇవ్వడం సుకుమార్ మంచితనం. మాటల వరకు మాత్రమే పరిమితం కాకుండా.. వాళ్ల కెరీర్ గ్రోత్‌కి సహాయం అందిస్తుంటాడు. తన నిర్మాణ సంస్థలో సినిమాలు చేసే అవకాశం కల్పిస్తాడు. ఇప్పటికే సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. త్వరలోనే మరికొంత మంది కూడా మెగా ఫోన్ పట్టడానికి రెడీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment