ఎన్నికల ప్రచారానికి దూరంగా పాన్‌ ఇండియా హీరోలు.. కారణం ఇదేనా..? | Sumalatha Comments On Yash Election Campaign | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారానికి దూరంగా పాన్‌ ఇండియా హీరోలు.. కారణం ఇదేనా..?

Published Mon, Mar 4 2024 9:40 AM | Last Updated on Mon, Mar 4 2024 10:15 AM

Sumalatha Comments On Yash Election Campaign - Sakshi

కర్ణాటక మాండ్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలత అంబరీశ్‌ మరోసారి కూడా అక్కడి నుంచే పోటీకి దిగనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు కంచుకోట లాంటి మాండ్యలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ను ఆమె ఓడించారు. సుమారు లక్షా ముపై వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత కోసం పాన్‌ ఇండియా స్టార్లు అయిన యశ్‌,దర్శన్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె కోసం పెద్ద ఎత్తున వారు పలు ర్యాలీలు నిర్వహించారు.

2024 ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ కూటమి నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తానని సుమలత చెప్పారు. మాండ్య లోసకభ నియోజకవర్గం నుంచి వంద శాతం నాకే సీటు దక్కుతుందని ఆమె తెలిపారు. గత సారి జరిగిన ఎన్నికల్లో స్టార్ నటులు యశ్‌, దర్శన్ తనకు మద్దతుగా ప్రచారం చేశారని.. ఈసారి ఎన్నికల ప్రచారానికి వారిద్దరూ రాకపోవచ్చని ఆమె అన్నారు. అప్పుడు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను.. ఇప్పుడు బీజేపీ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతున్నాను. ఇప్పుడు వారిద్దరినీ ఇబ్బంది పెట్టవద్దనుకున్నాను. అయినా తాను తప్పకుండా గెలిచి తీరుతానని ఆమె చెప్పుకొచ్చారు.

'2019 ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి ఇద్దరు స్టార్ నటులు యశ్‌, దర్శన్ నాతో కలిసి ప్రచారం చేశారు. ఇప్పుడు నేను బీజీపీ- జేడీఎస్‌ కూటమి తరుపున బరిలో ఉన్నాను కాబట్టి వారి అవసరం ఉండకపోవచ్చు.  సుమారు 25 రోజుల పాటు గత ఎన్నికల్లో వారిద్దరూ నా వెంటే ప్రచారం చేశారు. వారు నా కోసం త్యాగం చేశారు. మద్దతు మాత్రమే కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా నాకు అండగా నిలిచారు. నా కోసం వారి విలువైన సమయాన్ని మళ్లీ మళ్లీ  వదిలేయడం సరికాదు. నేను అంగీకరించను కూడా.

యశ్‌, దర్శన్‌లు సినిమా షూటింగ్స్‌లలో బిజీగా ఉన్నారు. అవి వదిలేసి రావడం సరికాదు. వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల వారిపై పలు విమర్శలు వస్తున్నాయి.  ఒక పార్టీ వైపు సినిమా నటులు ఉంటే.. వారి కెరియర్‌ మీద కూడా ప్రభావం పడవచ్చు. వారిద్దరూ ఎప్పటికీ నా ఇంటి బిడ్డలే.. ఒకవేళ నాకు వారి అవసరం ఉంది అంటే వారు తప్పకుండా వస్తారు. వారు వస్తే, నేను వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. ఎన్నికల ప్రచారం కోసం యశ్‌ వస్తే నాకు గొప్ప శక్తి అవుతారని భావిస్తున్నాను.' అని సుమలత అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement