
సాక్షి, గుంటూరు: నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెనాలి పరిధిలోని ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంత ఎత్తు ఎదిగినా.. ఆయన సొంతూరిపట్ల ఎంతో మమకారం ప్రదర్శించేవారని, వయసు తారతమ్యాలను ప్రదర్శించకుండా పేరుపేరునా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. అంతకుముందు..
సోమవారం ఆయన ఆరోగ్యం విషమించిందన్న సమాచారం తెలుసుకున్న బుర్రిపాలెం వాసులు.. ఎప్పటికప్పుడు క్షేమసమాచారాల గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరాభిమానులు. కానీ, ఆ పూజలు ఫలించలేదు. మంగళవారం వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ వార్త తెలియగానే.. గ్రామస్థులు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఈ ఉదయం కృష్ణ చిత్రపటానికి పూలమాలమేసి నివాళులర్పించారు.
బుర్రిపాలెం బుల్లోడు (1979) పేరుతో ఓ చిత్రంలో ఆయన నటించారు. ఇక చెన్నై, హైదరాబాద్‌లు కేంద్రంగా ఆయన నట శిఖరాలను అధిరోహించిన విషయం విదితమే. అయినా.. తాను పుట్టిన గడ్డకు సేవ చేయడం మాత్రం ఆయన మరువలేదు. ఆయన బుర్రిపాలెం వెళ్లినప్పుడల్లా పండుగ వాతావరణం నెలకొనేది. గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ నిర్మాణంతో పాటు కళ్యాణ మండపం, గీతా మందిరం కట్టించారు కృష్ణ. ఇక డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చారని కొందరు గ్రామస్తులు అంటున్నారు. ఊళ్లో వ్యవసాయం గురించి కూడా ఆయన ఆరాలు తీసేవారని మరికొందరు అంటున్నారు. మరోవైపు కరోనా సమయంలో ఆయన తనయుడు మహేష్ బాబు చొరవతో గ్రామంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగిన సంగతి తెలిసిందే.
హలో.. నా సినిమా ఎలా ఉంది?
బుర్రిపాలెం బుల్లోడిగా సూపర్ స్టార్ కృష్ణకు మరో ట్యాగ్ లైన్ కూడా ఉంది. మోసగాళ్లకు మోసగాడు సమయంలో.. ఆయన స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక సినిమాల పరంగానూ బుర్రిపాలెం సెంటిమెంట్‌ను ఆయన ఫాలో అయ్యేవారు. ఏ చిత్రం రిలీజ్ అయినా సరే.. ముందుగా అక్కడికి ఫోన్ చేసేవారట. గ్రామస్తుల్లో బాగా దగ్గరి వాళ్ల అభిప్రాయాలను ఫోన్ చేసి అడిగి తెలుసుకునేవారు. ఆ అభిప్రాయం ఎలా ఉన్నా సరే.. ఆయన స్వీకరించేవారట. ఇక విజయవాడ, తెనాలి ప్రాంతాల్లో ఆడియొన్స్ సినిమాకు బ్రహ్మరథం పడితే.. అది కచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతుందని నమ్మే వారు ఆయన. అంతేకాదు.. బుర్రిపాలెం వాసులు ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పలకరించేవారాయన.
ఇదీ చదవండి: కృష్ణ మరణానికి కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment