సుశాంత్‌.. నువ్వు బతికే ఉన్నావ్‌..! | Sushant Singh Rajput's 4th Death Anniversary: Remembering The Beloved Actor | Sakshi
Sakshi News home page

Sushant Singh Rajput: ప్రాణంగా ప్రేమించావ్‌.. చివరకు ఊపిరి వదిలేశావ్‌..

Published Fri, Jun 14 2024 12:10 PM | Last Updated on Fri, Jun 14 2024 2:06 PM

Sushant Singh Rajput's 4th Death Anniversary: Remembering The Beloved Actor

మనిషి మరణించినప్పుడు రెండు కన్నీటి బొట్లు రాలుస్తారు. రెండు రోజులకు అందరూ మరిచిపోతారు. కాలం గడిచేకొద్దీ ఆ వ్యక్తి గురించి ఆలోచించడమే మానేస్తారు. కానీ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషయంలో మాత్రం ఇప్పటికీ అభిమానులు అతడిని స్మరిస్తూనే ఉన్నారు. సుశాంత్‌ చనిపోయి నాలుగేళ్లవుతున్నా నిత్యం ఏదో ఒక సందర్భంలో తనను తలుచుకుంటూనే ఉన్నారు.

నొప్పి లేకుండా మరణం..
2020, జూన్‌ 14.. సుశాంత్‌ ఆఖరి శ్వాస విడిచిన రోజు.. చాలామందికి ఇదొక బ్లాక్‌ డే! తను ఆత్మహత్య చేసుకున్నాడని అధికారుల వివరణ.. లేదు, బాలీవుడ్‌ రాజకీయాలే తనను బలి తీసుకున్నాయని అభిమానుల ఆవేదన, ఆరోపణ! 'నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్‌ డిజార్డర్‌ అంటే ఏమిటి?' అని చనిపోయేముందు సుశాంత్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేసిన పదాలే తన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. తను ఎంత వేదన అనుభవించాడన్నది చెప్పకనే చెప్తున్నాయి.

అలిసిపోయాడా..
చిచోరె సినిమాలో ఆత్మహత్యలను వ్యతిరేకించే అనిరుధ్‌ పాత్రలో గొప్పగా నటించాడు. దిల్‌ బేచారాలో జనన మరణాలు మన చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంటుందన్న సందేశాన్ని ఇచ్చాడు. కానీ రియల్‌ లైఫ్‌లో మాత్రం దాన్ని పాటించలేకపోయాడో.. పరిస్థితులతో పోరాడీ పోరాడీ అలిసిపోయాడో కానీ తన కలల్ని, ఆశయాలను అలాగే వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అభిమానుల మనసు గెలుచుకున్న సుశాంత్‌ వారి హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటాడు..

కెరీర్‌..
సుశాంత్‌.. గ్రూప్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించాడు. కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌ సీరియల్‌లో చిన్న పాత్రలో నటించాడు. పవిత్ర రిష్తా సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జెర నాచ్కే దిఖా 2, ఝలక్‌ దిక్‌లాజా 4 రియాలిటీ షోలలో డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ చూపించాడు. 2013లో కాయ్‌ పో చే చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, పీకే, డిటెక్టివ్‌ బ్యోమకేష్‌ బక్షి, ఎంస్‌ ఎధోని సినిమాలతో అభిమానులను అలరించాడు. చివరగా దిల్‌ బేచార చిత్రంలో కనిపించాడు.

నా సినిమాలు ఆడకుంటే ఇండస్ట్రీ నుంచి నన్ను పంపించేస్తారు. ఎందుకని ఈ ఇండస్ట్రీ నన్ను తనలో ఒకడిగా భావించడం లేదు.. అంతా ముగిసిపోయినట్లుగా ఉంది.. 
- సుశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు..

మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరవుతోంది. అంతులేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను. 
- సుశాంత్‌ తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు..

ఆల్‌ ఇండియా ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ పరీక్షలో 7వ ర్యాంక్‌ సాధించిన సుశాంత్‌.. ప్రాణంగా భావించిన నటనకోసం అన్నింటినీ త్యజించాడు. కానీ ఆ సినిమా చివరకు అతడినే బలి తీసుకుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement