సుశాంత్ సింగ్
జూన్ 14.. 2020.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ తుది శ్వాస విడిచిన రోజు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ చనిపోయి జూన్ 14కి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగా సుశాంత్‌కి అవకాశాలు రాకుండా చేసి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుశాంత్ మరణంపై అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మృతిపై ముంబై పోలీసులే కాకుండా బీహార్ పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేయడం, బెయిల్ మీద బయటకు రావడం తెలిసిందే. సుశాంత్ మరణించి ఏడాది పూర్తయినా కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి ‘వియ్ మిస్ యు’, 'JusticeForSushantSinghRajput' అని ట్రెండ్ చేశారు.
వెబ్‌సైట్ ప్రారంభం... సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత వివరాలతో www.ImmortalSushant.com పేరుతో వెబ్‌సైట్ ఆరంభమైంది. సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రారంభమైన ఈ సైట్‌లో సుశాంత్ జీవిత విశేషాలు, సినిమాల వివరాలు, ఆయన వీడియోలు, ఫోటోలు ఉంటాయి.
నీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి – అంకితా లోఖండే
సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యా¯Œ ్స చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని రాశారు. ‘పవిత్ర్∙రిష్తా’ సీరియల్ షూటింగ్ సమయంలో అంకిత, సుశాంత్ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత రియా చక్రవర్తిని ప్రేమించారు సుశాంత్ సింగ్. ఇంకా సుశాంత్‌తో సినిమాలు చేసినవారు, అతని కుటుంబ సభ్యులు కూడా ట్వీట్ చేశారు.|
సహాయం, సలహా లేదా నవ్వు.. ఇవి నాకెప్పుడు కావాలన్నా నువ్వు (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) నాతో ఉన్నావు. ఈ నటనా ప్రపంచానికి నీతోనే (సారా తొలి చిత్రం ‘కేదార్‌నాథ్’లో సుశాంత్ హీరో) పరిచయం అయ్యాను నేను. కలలు నిజమవుతాయనే నమ్మకాన్ని నాలో కలిగించిన నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఈ మండుతున్న సూర్యుణ్ణి, వెలుగుతున్న చంద్రున్ని, ప్రకాశిస్తున్న నక్షత్రాలను చూస్తున్న ప్రతిసారీ నువ్వు మాతోనే ఉన్నావని మాకు అనిపిస్తుంటుంది.
– సారా అలీఖాన్
నీ ప్రశ్నలు, మనం మాట్లాడుకున్న సంభాషణలతో పాటు నిన్ను కూడా మిస్ అవుతున్నాను. నాకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఊహల్లో ఉన్న ప్రశాంతత నీకు దొరికిందనే ఆశిస్తున్నాను.
– భూమీ పెడ్నేకర్
మన జీవితాలను రెండు భాగాలుగా చూసే కొన్ని çఘటనలు ఉంటాయి. సుశాంత్ మరణం మా జీవితాల్లో అలాంటిదే. మా కుటుంబసభ్యుల జీవితాలు సుశాంత్ మరణానికి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారాయి. జీవించడానికి సంపాదించుకుంటున్నాం, మా పెద్దలను బాగానే చూసుకుంటున్నాం. ఇలా కొన్ని సాధారణ పనులు అందరి జీవితాల్లో జరిగినట్లుగానే మాకూ జరుగుతున్నాయి. కానీ మా అందరి ఆలోచనల్లో భర్తీ కానీ ఏదో శూన్యత దాగి ఉంది. అది మా జీవితాలను మార్చివేసింది. సుశాంత్ చాలామందికి దానాలు చేశాడు
– సుశాంత్ బావ విశాల్ కృతి.
జూన్ నెల అంతా పర్వత ప్రదేశాల్లో ఒంటరిగా గడపాలనుకుంటున్నాను. అక్కడ ఇంటర్‌నెట్, మొబైల్ ఫోన్‌లు అందుబాటులో ఉండవు. నా సోదరుడికి చెందిన జ్ఞాపకాలను ఆ నిశ్శబ్ద వాతావారణంలో నెమరువేసుకుంటాను’’ అని ఈ ఏడాది మే 26న సుశాంత్‌సింగ్ సోదరి శ్వేతాసింగ్ కృతి ట్వీట్ చేశారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు – శేఖర్ సుమన్
‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును త్వరితగతిన పూర్తి చేయమని సంబంధిత అధికారులను, ఏజెన్సీలను కోరుకుంటున్నాను. అనుమానాస్పద రీతిలో సుశాంత్ మనకు దూరమై ఏడాది అవుతోంది. ఓ మంచి వ్యక్తి సమాజంలోని కొన్ని కారణాల్ల ఒత్తిళ్లకు లోనయ్యాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని నమ్ముతున్నాను. అతని కేసు విషయంలో న్యాయం ఎందుకు ఆలస్యం అవుతోంది? కేసును ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇలా సమాధానాలు కావాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఆ జవాబులు ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ సుమన్.
నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు మాకు దూరమయ్యావన్న నిజాన్ని ఇంకా మర్చిపోలేకపోతు న్నాను. కాలం కొన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుందని కొందరు అన్నారు. కానీ నా కాలం, సర్వస్వం నువ్వు. నాకు తెలుసు.. నువ్వొక గార్డియన్ ఏంజిల్‌లా నీ టెలిస్కోప్ కళ్ళతో నన్ను చూస్తూ, కాపాడుతూనే ఉంటావని! నువ్వు వచ్చి నన్ను తీసుకుని వెళతావని ప్రతిరోజూ ఎదరుచూస్తూనే ఉన్నాను. అన్నిచోట్లా వెతుకున్నాను. నీ గురించి ఇది రాస్తున్నప్పుడు నా మనసులో ఎంత బాధ ఉందో చెప్పలేను. నువ్వు లేకుండా నా జీవితమే లేదు. నా జీవితంలో నెలకొని ఉన్న శూన్యం భర్తీ చేయలేనిది.
– రియా చక్రవర్తి
మన లుక్‌టెస్ట్ కోసం తొలిసారి నేను నిన్ను చూశాను. ఆలోచనల పరంగా రెండు విభిన్న ప్రపంచాలకు చెందిన ఇద్దరు వ్యక్తులం మనమని అనుకున్నాను. తర్వాత మనం ఇద్దరం కలిసి చేసిన ఓ సినిమా మన ఇద్దరి ప్రపంచాల్లో ఉన్న చాలా సంగతులు ఒకటేనని తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు లేవని బాధగా ఉంది. నువ్వు దూరమవ్వడాన్ని నేనింకా మర్చిపోలేకపోతున్నాను. నువ్వింకా మా మధ్యనే ఉన్నావనే అనుకుంటున్నాను.
– కృతీసనన్
Comments
Please login to add a commentAdd a comment