ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నటి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు డ్రగ్ డీలర్లు జైద్ విలాత్ర, బిసిత్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్‌సీబీ గొప్పగా ముందుకు సాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు.. ‘‘మేమంతా సత్యం వైపు పయనించేలా మార్గదర్శనం చేస్తున్నందుకు ధన్యవాదాలు దేవుడా’’ అంటూ #GreatStartNCB #Warriors4SRR #Flag4SSR అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. సుశాంత్ న్యాయం జరగాలని పోరాడుతున్న వారికి ఇదొక ఉపశమనమని పేర్కొన్నారు. (చదవండి: 5 కిలోల డ్రగ్స్‌కు డబ్బు చెల్లించు: షోవిక్)
కాగా జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్‌లో ఉరికి వేలాడుతూ కనిపించిన నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రేమ పేరిట సహజీవనం చేస్తూ, డబ్బు తీసుకుని.. మోసం చేసి, సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ అతడి కుటుంబం రియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 15 కోట్ల మేర తన అకౌంట్‌కు డబ్బు బదిలీ చేయించుకుందని ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే రియాను విచారించింది. (చదవండి: సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్)
ఇక సుశాంత్‌కు ఆమే డ్రగ్స్ అలవాటు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో సన్నిహితులతో రియా జరిపిన వాట్సాప్ చాట్స్ బయటకు రావడంతో ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో రియా, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండా నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఎన్‌సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రియానే తనను డ్రగ్స్ తీసుకురమ్మందని అతడు చెప్పడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. రియా, షోవిక్, శామ్యూల్ తదితరులతో కలిసి సుశాంత్ తన ఇంటి టెర్రస్‌పైన గంజాయి తాగేవాడని అతడి మేనేజర్ శృతి మోదీ కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment