Miss Universe: సుస్మితా సేన్‌ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి | Sushmita Sen Celebrates 30 Years Of Winning Miss Universe Crown | Sakshi
Sakshi News home page

Miss Universe: అందానికి దక్కిన కిరీటం.. 30 ఏళ్ల నాటి ఫోటో షేర్‌ చేసిన సుస్మితా సేన్‌

Published Tue, May 21 2024 11:13 AM | Last Updated on Tue, May 21 2024 11:30 AM

Sushmita Sen Celebrates 30 Years Of Winning Miss Universe Crown

బాలీవుడ్‌ హీరోయిన్‌, మాజీ  విశ్వ సుందరి సుస్మితా సేన్‌కు ఈరోజు చాలా ప్రత్యేకం. తాను విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకుని నేటితో 30 ఏళ్లు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె ఒకఫోటోను షేర్‌ చేసింది. 1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత ఆపై సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పేరు తెచ్చుకుంది.

మే 21, 1994న మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సుస్మిత రికార్డ్‌ క్రియేట్‌ చేసింది​. అప్పటి ఫోటోను షేర్‌ చేస్తూ సుస్మిత ఇలా చెప్పుకొచ్చింది. 'ఈ ఫొటో తీసినప్పుడు నా వయసు 18ఏళ్లు. నేను అనాథాశ్రమంలో ఈ చిన్నారిని కలిసిన క్షణంలో నేను జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాని నిర్ణయించుకున్నాను. అత్యంత అమాయకమైన ఆ చిన్నారి చూపు నన్ను కట్టిపడేసింది. 30 ఏళ్ల క్రితం నేను ఏదైతే అలాంటి వారికి  చేయాలని అనుకున్నానో ఇప్పుడు అదే చేస్తున్నాను.

ప్రతి ఏడాది మే 21ని చాలా గర్వంగా సెలబ్రెట్‌ చేసుకుంటాను. 21 మే 1994 నా జీవిత చరిత్రలో చెరిగిపోని ఒక పేజీ.. ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కనిపిస్తున్నాయి.  భారతదేశం ఎల్లప్పుడూ నాకు గొప్ప గుర్తింపు, శక్తిని ఇచ్చింది. గత మూడు దశబ్ధాలుగా అభిమానులు అంతులేని ప్రేమను నాకు అందిస్తున్నారు. ఈ సంతోషం సందర్భంగా నాకు మెసేజ్‌లు పంపుతున్న అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.' అని ఆమె తెలిపింది.

1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో  సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షుబీర్‌ సేన్‌ భారత వైమానిక దళంలో వింగ్‌ కమాండర్‌గా పని చేయగా, తల్లి శుభ్రా సేన్‌ నగల డిజైనర్‌. సుస్మిత హైదరాబాద్‌లో జన్మించినా చదువంతా ఢిల్లీలో సాగింది.తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది. 2013 సంవత్సరానికి సుస్మితాసేన్‌ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషిచేసేవారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్‌ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది. 2015 లోనే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సుస్మితా సేన్‌.. ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్‌ సీరిస్‌లలో నటించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement