మంచితనానికి, హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణం రాజు. సాయం కోసం చేయి చాచిన ఎంతోమందికి ఆపన్నహస్తం అందించారు. చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. మరో మూడు రోజుల్లో (జనవరి 20న) ఆయన పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా అభిమానులు కృష్ణం రాజును తలుచుకుంటున్నారు. తాజాగా ఆయన సతీమణి శ్యామలా దేవి.. కృష్ణం రాజుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది.
ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు
శ్యామలా దేవి మాట్లాడుతూ.. 'నాకు తల్లీతండ్రీ, గురువు, దైవం, సర్వస్వం అంతా కృష్టం రాజుగారే! నాకు ఆయనే సర్వాంతర్యామి. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు. ఆయన జ్ఞాపకార్థంగా నేను మిగిలున్నానంతే! నేను ఆయన జీవితంలోకి ఎలా వచ్చానంటే... కృష్టం రాజుగారు ఎన్నో దానధర్మాలు చేస్తారని ఇంట్లో మాట్లాడుకుంటే విన్నాను. అలా ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అనుకోకుండా మా చుట్టాల ద్వారా తనతో పెళ్లి సంబంధం కుదిరి ఆయన అర్ధాంగిగా మారాను. కానీ అప్పటికే కృష్ణం రాజుకు ఓసారి పెళ్లయింది. మొదటి భార్య పేరు సీతాదేవి. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఓసారి చెన్నైలో షాపింగ్‌కు వెళ్తుండగా కారు ప్రమాదంలో ఆమె మరణించింది.
నిరాహార దీక్ష..
ఇది ఆయన జీవితంలో మర్చిపోలేని విషాదం. ఆ బాధ తట్టుకోలేకపోయాడు, ఒంటరివాడయ్యాడు. ఇది చూసిన కృష్ణం రాజు తండ్రి ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు కానీ తన ఆకలి తనకు తెలియదు. అడిగి భోజనం పెట్టేది భార్య మాత్రమే అని రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సీతాదేవిని ప్రాణంగా ప్రేమించిన ఆయన రెండో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో మామయ్య.. ఈయన పెళ్లికి ఒప్పుకునేవరకు భోజనం చేయనని నిరాహార దీక్ష చేశారు. తండ్రి బాధ చూడలేక కృష్ణం రాజు రెండో పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి అమ్మాయి కోసం ఆరా తీయగా నా బంధువులెవరో నా పేరు సూచించారు. కానీ ఇక్కడ మా అమ్మ ఒప్పుకోలేదు.
బలవంతంగా ఒప్పించారనుకున్నారు
రెండో పెళ్లి.. పిల్లలు కావాలనుకుంటారో, లేదో.. అని ఎన్నో అనుమానాలతో ఈ సంబంధాన్ని పెద్దగా ఇష్టపడలేదు. అయితే నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఎందుకంటే అప్పటికే తనపై మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి పెళ్లికి సిద్ధమయ్యాను. నన్ను బలవంతంగా ఒప్పించారేమోనని కృష్ణంరాజు అనుకున్నారు. అసలు విషయం కనుక్కోమని తన కజిన్‌ను నా దగ్గరకు పంపించగా.. నేను ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నానని చెప్పాను. నిజానికి కృష్ణంరాజుకు వారసుడు పుట్టాడు. ఆయన మొదటి భార్యకు ఓ కొడుకు పుట్టి జన్మించాడు. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు మరణించాడు' అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఆలయంలో ప్రముఖ నటుడి కూతురి పెళ్లి.. ముఖ్య అతిథిగా మోదీ
Comments
Please login to add a commentAdd a comment