నటుడు ధనుష్‌పై ఎలాంటి ఫిర్యాదు లేదని నడిగర్ సంఘం పేర్కొనడం అవాస్తవం: తమిళ నిర్మాతల మండలి
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) మధ్య వివాదం ముదురుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమిళ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం నిర్వాహకులు సమావేశమై నటీనటుల పారితోషికాలు, పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, నటీనటులు ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాకే కొత్త చిత్రాలను అంగీకరించాలని, నటుడు ధనుష్ చాలా చిత్రాలకు అడ్వాన్స్‌లు తీసుకున్నారని, ఆయనతో కొత్తగా చిత్రాలు చేసే నిర్మాతలు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు.
నిర్మాతల మండలి చేసిన ఈ తీర్మానాలు తమకు సమ్మతం కాదని, వెనక్కి తీసుకోవాలని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై స్పందిస్తూ తమిళ నిర్మాతల మండలి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నటుడు ధనుష్‌పై ఎలాంటి ఫిర్యాదు లేదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని నిర్మాతల మండలి పేర్కొంది.
ఏడాదిన్నర క్రితమే నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి, దాన్ని నడిగర్ సంఘానికి పంపామని తెలిపింది. అయితే దానిపై ఆ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ కారణంగానే నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో పాటు తమకు నడిగర్ సంఘం సహకరిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. దీనిపై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment