సాక్షి, హైదరాబాద్: టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లి దేహి అని అడుక్కోవడం సరికాదంటున్నాడు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj). మొన్న జరిగింది ఇండస్ట్రీ సమావేశం కాదని, వ్యక్తిగతంగా కొందరు ప్రభుత్వాన్ని కలిశారని తెలిపాడు. కాగా సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగు సినీ ప్రముఖులతో గురువారం (డిసెంబర్ 26న) సమావేశమయ్యారు.
ఇండస్ట్రీ మీటింగ్ కాదు!
ఈ మీటింగ్ గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'ఇది ప్రభుత్వం పిలిచి మరీ ఏర్పాటు చేసిన మీటింగ్ కాదనుకుంటున్నాను. ఆ మీటింగ్‌కు నాకు ఆహ్వానం అందలేదు. ఇండస్ట్రీ అంటే ఛాంబర్ ఒక్కటే.. అన్ని సెక్టార్లు కలిపితేనే ఇండస్ట్రీ. అవన్నీ ఛాంబర్ కిందే ఉంటాయి. అది ఛాంబర్ సమావేశం కాదని తెలిసింది. టీఎఫ్‌డీసీ (Telangana Film Development Corporation) చైర్మన్ దిల్‌రాజును పిలవడంతో ఆయన కొంతమందిని తీసుకెళ్లారు. సినిమాలు తీసే నిర్మాతలు వాటి పరిష్కారం కోసం వెళ్లారు. బెనిఫిట్ షోలు వద్దని ముందే చెప్పా.. ఇప్పటికైతే పుష్ప 2తో ఏర్పడిన గ్యాప్ పోయింది. అల్లు అర్జున్ సమస్య సద్దుమణిగిపోయింది.
సమాజానికి ఉపయోగపడేవి చేయండి
టాలీవుడ్ ఇప్పటికే ప్రపంచరికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. మన దగ్గర అన్ని భాషల సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇక్కడ పెట్టాలంటే హైదరాబాద్‌లో ఆఫీస్‌లు ఉండాలి. ఇకపోతే అల్లు అర్జున్, సుకుమార్ గతంలో మంచి సందేశాన్నిచ్చే షార్ట్ ఫిలిం చేశారు. ఎన్టీఆర్, చిరంజీవిగారు కూడా చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ల మద్దతుండాలి. కేవలం మూవీ రిలీజప్పుడే కాకుండా అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలి' అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment