నాన్న ఎందుకో వెనకబడ్డాడు.. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మకంటే నాన్న చాలా వెనుకబడ్డాడు.. ఆ మధ్య నటుడు తనికెళ్ల భరణి ఈ కవిత చదివి వినిపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పట్లో ఈ వీడియోను చూసి కంటతడి పెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా తన తండ్రిని తలుచుకుని మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు తనికెళ్ల భరణి. ఓ ఇంటర్వ్యూలో ఆయన తండ్రితో తనకున్న అనుబంధాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.
చెప్పులు కొనిస్తాడనుకుంటే..
ఏడో తరగతి చదువుకునే వరకు నా కాలికి చెప్పుల్లేవు. ఓసారి రోడ్డుమీద నడుస్తుండగా కాలిన సిగరెట్ మీద కావాలని కాలేసి అమ్మా అని అరిచాను. మా నాన్న వెంటనే అటూఇటు చూసి చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి నాకో జత కొనిస్తాడని అలా చేశాను. కానీ మా నాన్న చూసుకుని నడవలేవా? అని ఒక్కటిచ్చాడు. ఒకసారైతే నేను చేసే పనులు చూసి చెట్టుకు కట్టేసి కొట్టాడు.
వంద రూపాయల కోసం బూతులు..
మా నాన్న లాల్చీలో నుంచి రెండు రూపాయలు అలా కొట్టేసేవాడిని. ఓసారి ఆయన జేబులో నుంచి వంద రూపాయలు కొట్టేశాను. రాత్రి నేను అన్నం తింటుండగా వచ్చి.. వాడికి పప్పు, నెయ్యి ఎక్కువ వేయి, మనింట్లో భోజనం చేయడం ఇదే చివరిసారి కదా.. రేపటినుంచి జైల్లోనే కదా ఉండేది అని అమ్మతో అన్నాడు. వంద రూపాయలు కొట్టేస్తావా.. అని బూతులు తిట్టాడు. ఎప్పుడైనా నేను మా నాన్న జేబులో వెయ్యి రూపాయలు పెడితే ఎందుకనేవాడు. చిన్నప్పుడు కొట్టేసిన డబ్బులకు వడ్డీ అని చెప్పేవాడిని.
చెడు అలవాట్లు.. నాన్న ఎంత బాధపడ్డాడో
అప్పట్లో సిగరెట్స్ కాల్చేవాడిని. ధూమపానం మానేసిన నాన్న ఓసారి నా జేబులో నుంచి సిగరెట్ కొట్టేసి కాల్చాడు. అయితే ఒకానొక సమయంలో నాన్న నా గురించి చాలా బాధపడ్డాడు. అప్పుడు నాకు సిగరెట్ తాగడం, గంజాయి తాగడం.. ఇలా ఊహించనన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. నన్ను కొట్టాడు.. కానీ ఆయన మనసులో ఎంత బాధపడ్డాడో!' అని చెప్తూ ఏడ్చేశాడు తనికెళ్ల భరణి.
చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. కావాలనే ఇండస్ట్రీకి దూరం చేశారు
Comments
Please login to add a commentAdd a comment