ఎ సూటబుల్ బాయ్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సిరీస్. అందులో ‘లతా మెహ్రా’గా నటించిన తాన్యా మాణిక్తలా ఓటీటీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వాళ్ల చర్చల్లోనూ ప్రధాన భూమిక అయింది. ఎవరీ తాన్యా?
- ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్ (శివాజీ కాలేజ్)లో డిగ్రీ ఇంగ్లిష్ లిటరేచర్ చదివింది. తాన్యాకు ఇద్దరు తోబుట్టువులు.. అన్న అభిజీత్, అక్క సాన్యా.
- డిగ్రీ అయిపోయిన వెంటనే ‘ది సోషల్ రష్’ అనే మీడియా వెబ్‌సైట్‌లో కాపీ రైటర్‌గా చేరింది. ఆ అనుభవంతో ఆ టైమ్‌లోనే అంటే 2018లోనే తనూ ఒక యూట్యూబ్ చానెల్‌ను మొదలుపెట్టింది ‘తాన్యా మాణిక్తలా’ పేరుతోనే.
- తన యూట్యూబ్ చానెల్ పాపులారిటీ ‘టీవీఎఫ్’ వాళ్ల ‘ఫ్లేమ్స్’ సిరీస్‌లో నటించే అవకాశాన్నిచ్చింది. అదే సమయంలో ‘ది టైమ్‌లైనర్స్’ అనే యూ ట్యూబ్ చానెల్‌కూ పనిచేయమనే పిలుపొచ్చింది. ఈ రెండిటితో డిజిటల్ మీడియా వీక్షకులకు సుపరిచితమైంది తాన్యా. ‘ఫ్లేమ్స్’తో సంపాదించుకున్న అభిమానం ఆ సిరీస్ సీక్వెల్‌లోనూ తాన్యా స్థానాన్ని స్థిరం చేసింది.
- ఒక వైపు టీవీఎఫ్ వెబ్ సిరీస్, తన యూట్యూబ్ చానెల్, ది టైమ్ లైనర్స్, ది సోషల్ రష్‌తో క్షణం తీరికలేకుండా ఉన్నప్పుడే ‘ఎ సూటబుల్ బాయ్’ చాన్స్ ఆమె కాల్షీట్ డైరీ చెక్ చేసుకొమ్మంది.
- అభినయ ప్రజ్ఞాశాలి టబు, విలక్షణ నటుడు అనిపించుకోవాలనే తపనతో ఉన్న ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి నటించే ఆపర్చునిటీ.. అన్నిటికీ మించి ది గ్రేట్ డైరెక్టర్ మీరా నాయర్ దర్శకత్వం.. రెండో ఆలోచన లేకుండా ఆడిషన్స్‌కు వెళ్లింది. సెలెక్ట్ అయింది. ఇలా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయ వెబ్ వీక్షకులకు అభిమాన తార అయింది.
- హిందీ, ఇంగ్లిష్‌తో పాటు స్పానిష్ భాషలోనూ దిట్ట తాన్యా.
- పుస్తక పఠనం హాబీ.
‘పుస్తకాలంటే పిచ్చి. కాని నా బ్యాడ్‌లక్ ఏంటంటే ఏ నవల (ఎ సూటబుల్ బాయ్) ఆధారంగానైతే ‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్ తీశారో ఆ నవలే నేను చదవకపోవడం. విక్రమ్ సేథ్ తతిమా బుక్స్ కొన్ని చదివాను. కాని ఈ నవలే చదవలేదు. మా యూనివర్సిటీ థియేటర్ గ్రూప్‌లోని ఒక ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసింది. ‘బీబీసీ వాళ్ల కోసం మీరా నాయర్ ఓ సిరీస్ తీస్తున్నారట.. ఆడిషన్స్ ఉన్నాయి రా’ అని. వెళ్లాను. ఫస్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అయ్యాను. నన్ను మీరా నాయర్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక మళ్లీ ఆవిడ ఆడిషన్స్ తీసుకుంటారని.. ఆమె డెసిషనే ఫైనల్ అని చెప్పారు.
అప్పుడే తెలిసింది ఆవిడ తీయబోయే సిరీస్ ఎ సూటబుల్ బాయ్ నవల అని. గుండెలో రాయిపడ్డట్టయింది. ఎందుకంటే ఆ బుక్ చదవలేదు కదా. మా ఫ్రెండ్‌తో చెబితే ‘ఓస్ ఇంతదానికి కంగారెందుకు? నేను చదివాను’ అంటూ ఆ కథ మొత్తం నాకు చెప్పింది ఇంపార్టెంట్ డైలాగ్స్‌తో సహా. దాంతో నా ఇంటర్వ్యూ చక్కగా పూర్తయింది. ఆడిషన్స్‌లోనూ మీరా నాయర్‌కు నచ్చాను. లతా మెహ్రా పాత్రకు ఓకే అయ్యాను. రిజల్ట్స్ మీ ముందుకొచ్చాయి’ అంటూ జరిగింది గుర్తుచేసుకుంది తాన్యా మాణిక్తలా... ఎ సూటబుల్ యాక్ట్రెస్.
Comments
Please login to add a commentAdd a comment