టైటిల్: తెప్పసముద్రం
నటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలు
నిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్
నిర్మాణ సంస్థ: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: : పి.ఆర్
సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లి
ఎడిటర్: సాయిబాబు తలారి
విడుదల తేది: ఏప్రిల్ 19, 2024
‘తెప్పసముద్రం’ కథేంటంటే..
తెలంగాణలోని తెప్పసముద్రం అనే గ్రామంలో తరచు స్కూల్ పిల్లలు మాయం అవుతుంటారు. వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఛేదించడానికి ఎస్సై గణేష్(చైతన్య రావు) ప్రయత్నిస్తుంటాడు. క్రైమ్ మిర్రర్ రిపోర్టర్‌గా పని చేస్తున్న ఇందు(కిశోరి ధాత్రిక్) కూడా ఈ మిస్సింగ్ కేసు గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఇందుని ప్రాణంగా ప్రేమించే ఆటో డ్రైవర్ విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ఎస్సై గణేశ్ తండ్రి లాయర్ విశ్వనాథ్(రవిశంకర్) కూడా తన దగ్గరకు ట్యూషన్ వచ్చే పిల్లలు తప్పిపోవడంతో..ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గజా చేసే గంజాయి దందా బయటపడుతుంది. ఈ కేసులో విజయ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తాడు గణేష్. ఆ సమయంలోనే పిల్లల కిడ్నాప్‌కి సంబంధించిన విషయంలో విస్తుపోయే నిజం ఒకటి తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? తప్పిపోయిన పిల్లలు ఏమయ్యారు? ఎస్సై గణేష్ ఈ కేసును ఛేదించాడా లేదా? సైకో కిల్లర్‌ని చంపిందెవరు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సినిమాల్లో ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఈ విషయంలో తెప్ప సముద్రం కొంతవరకు సఫలం అయింది.
చిన్నారులను హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తికరంగా కథననాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ చిత్రమే. ఓ సైకో.. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ.. వారిని హత్య చేయడం, చివరకు అతన్ని కనిపెట్టి అంతమొందించడం.. సింపుల్‌గా చెప్పాలంటే తెప్పసముద్రం కథ ఇంతే. కానీ దర్శకుడు దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. స్క్రీన్‌ప్లే కథపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకు కనిపెట్టలేం. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘హాజీపూర్ ఘటనను గుర్తు చేస్తోంది.
రొటీన్ లవ్‌స్టోరీగా సినిమా ప్రారంభం అవుతుంది. తన ప్రేమ విషయాన్ని హీరోయిన్‌కి చెప్పడానికి హీరో భయపడడం.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరుమీద డొనేషన్ ఇవ్వడం.. ఆ విషయం తెలిసి హీరోని హీరోయిన్ ప్రేమించం..ఫస్టాఫ్ ఇలా రొటీన్‌గా సాగుతుంది. వరుస హత్యలపై ఎస్సై గణేష్ చేసే ఇన్వెస్టిగేషన్‌ని కథపై ఆస్తకిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్దుంది. సెకండాఫ్ అంతా ట్విస్టులతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఒకింత షాక్‌కి గురవుతారు. ఆ తర్వాత కిల్లర్ బాల్యం నుంచి హత్య వరకు ప్రతిది డిటెయిల్డ్‌గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఆటోడ్రెవర్, హీరోయిన్ లవర్‌గా అర్జున్ అంబటి చక్కగా నటించాడు. డ్యాన్స్ తో పాటు ఉన్నంతలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. క్రైమ్ రిపోర్టర్ ఇందుగా కిశోరి దాత్రిక్ తన పాత్ర పరిధిమేర నటించి మెప్పించింది. ఎస్సై గణేశ్‌గా చైతన్య రావు అద్భుతంగా నటించాడు. చైతన్య రావు గతంలో ఈ తరహా పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా రవిశంకర్‌తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పి.ఆర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ గుండెను బరువెక్కిస్తుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి
Comments
Please login to add a commentAdd a comment