పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగు చిత్రాలకు, నటులకు పరభాషా అభిమానుల ఆదరణ పెరిగిందని సినీనటుడు వడ్డి నాగ మహేష్ అన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన వరుసగా రంగస్థలం, గద్దలకొండ గణేష్, ఉప్పెన, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. రచయితగా ప్రయాణం మొదలు పెట్టి నటుడిగా స్థిరపడిన నాగ మహేష్ హనుమాన్‌జంక్షన్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు.
రచయిత నుంచి నటుడిగా..
చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో 1990లో చైన్నె వెళ్లి ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఫలితం దక్కలేదని నాగ మహేష్ చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయంగా 1996లో ‘కొత్తపుంతలు’ కథతో రచయితగా ప్రయాణం మొదలు పెట్టానని, ‘శ్రీవల్లి’ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ వద్ద సహాయకుడిగా పని చేశానని తెలిపారు. ఎస్‌కే మిశ్రో శిష్యరికంలో రంగస్థల నటుడిగా పలు సాంఘిక నాటకాలలో నటించటంతో పాటు సినిమా రంగంపై ఆసక్తితో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించిన్నట్లు తెలిపారు.
దీంతో 2016లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించే చాన్స్ దక్కిందని వివరించారు. ఆ సినిమాలో ఇన్‌స్పెక్టర్ పాత్ర, రంగస్థలంలో హీరోయిన్‌కి తాగుబోతు తండ్రిగా, ఉప్పెనలో విలన్ విజయ్ సేతుపతితో పాటు నటించిన గోవింద్ పాత్రలు ప్రేక్షకులకు దగ్గర చేశాయన్నారు. ఆ తర్వాత గద్దలకొండ గణేష్, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు.
ఇప్పటికీ సుమారు 50కిపై తెలుగు చిత్రాలలో నటించగా, త్వరలో విడుదల కానున్న సలార్, ఉస్తాద్ భగత్ సింగ్, గేమ్ ఛేంజర్, యురేకా కసామిసా, శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్, రజకార్ చిత్రాలలోనూ మంచి పాత్రలలో నటించానని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోందని, దీని వల్ల తెలుగు నటులకు ఇతర భాషల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా మార్కెటింగ్ కోసం దర్శక, నిర్మాతలు వేర్వేరు భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment