
ఇటీవల అలనాటి సినీ నటి జయప్రద ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆమె సోదరుడు రాజా బాబు మరణించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన గురువారం (ఫిబ్రవరి 27) తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని జయప్రద సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా జయప్రద తన సోదరుడు రాజా బాబు అస్థికలను రాజమండ్రిలోని గోదావరి నది పుష్కర ఘాట్‌లో కలిపారు. ఈ సందర్భంగా తన సోదరుడి గురించి ఆమె మాట్లాడారు. ఆయన మా జీవితాల నుంచి దూరంగా వెళ్లిపోయినందుకు మాకు చాలా బాధగా ఉందన్నారు. ఆయన కుమారుడు సామ్రాట్‌తో కలిసి రాజాబాబు జన్మస్థానంలో అక్కడే అస్థికలు కలిపేందుకు వచ్చామని జయప్రద తెలిపారు.
నా సోదరుడు రాజా బాబు ఇక్కడే పుట్టి పెరిగాడు. ఇక్కడే చదువుకున్నాడు. అతనితో ఉన్న ఎన్నో మరవలేని క్షణాలు గుర్తుగా ఉండిపోయాయి. నేను రాజమండ్రి ఎప్పుడొచ్చినా నా సోదరుడితోనే కలిసి వచ్చేదాన్ని. మొదటిసారి ఆయన లేకుండా ఇక్కడికి వచ్చా. మా జీవితాల్లో రాజాబాబు లేకపోవడం బాధగా ఉంది. అతని కుమారుడైన సామ్రాట్‌తో కలిసి ఈ రోజు అస్థికలు ప్రదానం చేయడానికి వచ్చాం. నా సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు.
ఇక జయప్రద విషయానికొస్తే 14 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1994లో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతానికైతే బీజేబీలో కొనసాగుతున్నారు. అలానే ప్రభాస్ 'ఫౌజీ'లోనూ ప్రస్తుతం నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment