క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆర్య నుంచి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ పుష్పదాకా ఆయన కరియర్ గ్రాఫ్ అలా రైజింగ్‌లోకి వచ్చేసింది. పకడ్బందీ స్క్రీన్‌ప్లే మాత్రమే కాదు.. స్టార్ హీరోలను డీగ్లామరైజ్డ్ కారెక్టర్లలో చూపించి మెప్పించడం సుకుమార్ ట్రెండ్. అంతేనా..ఊ అంటావా.. ఊహూ అంటావా మావా అంటూ జనంచేత ఊర మాస్ స్టెప్పు లేయించారు ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ సుక్కు సార్. జనవరి 11 సుకుమార్ బర్త్‌డే సందర్భంగా లెక్కల మాస్టారికి హ్యాపీ బర్తడే అంటోంది సాక్షి.
సుకుమార్ 1970 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో పుట్టారు. ఇంట్లో ఎపుడూ సినిమాల గురించే చర్చ. అలా ముగ్గురు అన్నల ముద్దుల తమ్ముడిగా బోల్డన్ని సినిమాలను చూసే అవకాశం ఇక్కింది. అలా అని చదువును ఎపుడూ నిర్లక్ష్యం చేయలేదు. మాథ్స్‌లో మంచి ప్రావీణ్యం సాధించిన సుకుమార్ భీమవరంలో లెక్కల మాస్టారుగా పాఠాలు చెప్పారు. ఆ తరువాత కొన్ని మూవీలకు రైటర్‌గా పని చేశారు. అలా 2004లో బన్నీ హీరోగా ‘ఆర్య’ పట్టాలెక్కింది. తొలి చిత్రంతోనే అటు ఇండస్ట్రీని ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుని భళా అనిపించారు సుకుమార్.
మూడేళ్ళ గ్యాప్ తరువాత తీసిన జగడం సక్సెస్ కాలేదు. చివరికి తనకు తొలి సక్సెస్ ఇచ్చిన అల్లు అర్జున్‌తోనే ‘ఆర్య-2’ తెరకెక్కించినా పరాజయం పలకరించింది. మళ్లీ ‘100 పర్సెంట్ లవ్’ హిట్ తరువాత వన్ నేనొక్కడినే అన్నా నో యూజ్. కొంత గ్యాప్ తరువాత యంగ్ హీరో ఎన్టీర్‌తో కు ‘నాన్నకు ప్రేమతో’ మూవీతో జనాన్ని ఎట్రాక్ట్ చేసారు. ఇక ఆ తరువాత మెగా హీరో రాం చరణ్‌తో ‘రంగస్థలం’ తెరకెక్కించి, అప్పటివరకు తన కరియర్‌లో ఉన్న లెక్కలన్నింటిని సరిచేసేశారు. అదే ఊపులో ‘అల…వైకుంఠపురములో’ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై సుకుమార్ కన్ను పడింది. పుష్ప అంటే పువ్వు కాదు ఫైర్ అంటూ ‘పుష్ప’ చిత్రం రగిలించిన ఫైర్ మామూలుగా అంటుకోలేదు. తెలుగు పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పట్లో ‘ఆర్య, ఆర్య-2’ ఇపుడు ‘పుష్ప-ద రైజ్’కు సీక్వెల్ ‘పుష్ప-ద రూల్’ తెరకెక్కిస్తున్నారు. ఏం పుష్ప పార్టీ లేదా అంటూ తన మార్క్ విలనిజంతో ఆకట్టుకున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విశ్వ రూపాన్ని ఆవిష్కరించబోతున్నారు సుకుమార్. సుక్కు, బన్నీ, ఫహాద్ కాంబోలో రాబోతున్న మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
తన 17ఏళ్ల కెరియర్‌లో దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు సుకుమార్. ముఖ్యంగా ‘‘అ అంటే అమలా పురం, రింగ రింగ..రింగ రింగారే, డియ్యాలో.. డియ్యాలో, లండన్‌బాబు, జిగేలు రాణి, తాజాగా పుష్పలోని ఊ అంటావా మావా’’ లాంటి ఐటెం సాంగ్స్ ఆయన మూవీల్లో స్పెషల్ ఎట్రాక్షన్. 2022లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బరిలోకి దిగుతున్నారట. విజయ్ దేవరకొండతో ఒక మూవీని, అలాగే రంగస్థలం కాంబో రిపీట్ చేస్తూ రాంచరణ్‌తో మరో మూవీకోసం స్టోరీని సిద్ధం చేస్తున్నారట.
మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే రంగస్థలంలో రాంచరణ్‌తో ప్రత్యేక యాస మాట్లాడించి, రఫ్ లుక్‌లో చూపించి హిట్ కొట్టేశారు. పుష్పలో కూడా అదే మంత్రా రిపీట్ చేశారు. బన్నీని డీ గ్లామరైజ్డ్‌గా చూపించి, సీమ యాసలో డైలాగులుచెప్పించి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. పొలిటికల్ సెటైర్స్‌తోనూ విమర్శకులను ఆకట్టుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రయోగాలు ఇంకెన్ని చేయనున్నారో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment