గతంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపారు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని.. నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'మాకు.. ఎస్పీ చరణ్ సార్‌కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ సమస్య వచ్చింది. ఏదేమైనా మాకు ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది. అంతే కాకుండా మన సినీ దిగ్గజాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ డిస్ రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం చేసే చిన్న సినిమాలు మీరు కూడా చూస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్లతో కలిసి కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. అలా చేయాలనే కోరిక కూడా లేదు. కానీ మా వరకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ఉన్నాం. ఏఐ వచ్చినా కూడా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవాళ, రేపు మన జాబ్ ప్రమాదంలో ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. మేం చేసినా.. చేయకపోయినా మార్పు అయితే జరుగుతది. మా మధ్య కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడంతా ఓకే. ఆ సమస్య ముగిసిపోయింది' అని అన్నారు.
అసలేం జరిగిందంటే..
కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment