ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి అదిత్ అరుణ్ (త్రిగుణ్). తనకున్న టాలెంట్‌తో హీరోగా ఎదిగాడు. పలు చిత్రాలు చేసినప్పటికీ ఇప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నేను చాలా సినిమాలు చేశాను. కానీ ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. నేను చిరంజీవికి వీరాభిమానిని. స్కూల్‌లో ఉన్నప్పుడే ఆయన్ను కలిశాను. మా ఇంట్లో చిరంజీవిది తప్ప ఎవరి ఫోటో ఉండదు. ఆయన కూతురు సుష్మితతో పరిచయముంది. నన్ను చిరుకు పరిచయం చేస్తానంది కానీ నేను ఒప్పుకోలేదు. ఏదో ఒక రోజు నా పేరు తనకు తెలుస్తుంది.. ఆరోజే తనను కలుస్తానని చెప్పాను.
అది జీవితంలో మర్చిపోలేను
నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది.. నేను ఉద్వేగం సినిమా చేశాను (త్వరలో రిలీజవుతుంది). ఆ సినిమా చివరి రోజు షూటింగ్... ఉదయం రెడీ అవుతున్నాను, ఇంతలో నాన్న నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. అమ్మ చనిపోయిందని చెప్పాడు. నిర్మాతకు షూటింగ్‌కు రాలేనని ఎలా చెప్పాలా? అని చాలా టెన్షన్ పడ్డాను. సినిమాకు డబ్బుల్లేని రోజులు, ఫ్లాప్ అయినప్పుడు, సినిమా ఆగిపోయిననాడు.. ఎన్నడూ అంత టెన్షన్ పడలేదు. ఆరోజు మాత్రం ఓపక్క కన్నీళ్లు, మరోపక్క చెమటలు పట్టాయి. నిర్మాతకు చెప్తే వెంటనే షూటింగ్ క్యాన్సల్ చేశాడు.
ఇంటికి రౌడీలను పంపించారు
పా.రంజిత్.. అట్టకత్తి సినిమాకు నన్నే హీరో అనుకున్నాడు. కానీ అప్పటికే చేతిలో మరో సినిమా ఒప్పుకోవడంతో అది చేయలేకపోయాను. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రెట్ ఫీలవుతుంటాను. రెండేళ్లక్రితం.. కొందరు ఓ సినిమా షూట్ చేస్తున్నామని అడ్వాన్స్ ఇచ్చి ఫోటోలు తీశారు. తీరా నన్ను పక్కన పెట్టి ఓ హీరో కుమారుడిని పెట్టారు. నాకు కోపమొచ్చి అడ్వాన్స్ తిరిగివ్వలేదు. ఇంటికి రౌడీలను పంపించారు. బెదిరించారు.. అయినా బెదరలేదు' అని చెప్పుకొచ్చాడు అదిత్ అరుణ్.
Comments
Please login to add a commentAdd a comment