సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్‌కు పరిచయమై దశాబ్ధంపైగానే అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపుగా బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలు అందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో దేశ ముదురు సినిమా కోసం అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్‌లో తళుక్ మంటున్నారు.
నాణేనికి మరోవైపు...
ఆ మధ్య టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని కూడా కొన్ని విశ్లేషణలు వెలుగు చూశాయి.
అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
సిక్స్‌ప్యాక్ కారణం?
టాలీవుడ్‌లో హీరోలకు క్రేజీగా మారిన సిక్స్‌ప్యాక్ దక్కించుకుని, దాని కొనసాగింపుల కోసం నాగశౌర్య గత కొన్ని నెలలుగా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారని, అదే విధంగా కఠినమైన డైట్ రొటీన్‌ను పాటిస్తున్నారని సమాచారం. యువకుడు, ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే నాగశౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చునని అంటున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇంకా ఆ విషయాన్ని థృవీకరించలేదు.
ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీ కి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉంది. అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా...
నిపుణులేమంటున్నారు?
ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు. సిక్స్–ప్యాక్ మానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాతని వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
సిక్స్ ప్యాక్ శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారేం చెప్తున్నారంటే...
► అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను బాగా ప్రభావితం చేస్తుంది.
► తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరమైన విషయం. ఆహారం నుంచి ఉప్పును తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది.
► అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురి చేసే అవకాశం ఉంది.
► అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, ఆ ఆరు పలకల కండరాలు ప్రస్ఫుటంగా కనిపించడం కోసం తరచు తరచి చూసుకోవడం, అవి కనపడని రోజున తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగవచ్చుని అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని కూడా సైక్రియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
► బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎవరు ఎక్కువ శ్రమపడినా అది ప్రమాదకరమే కావచ్చునంటున్నారు.
► ఇక ఫాస్ట్‌గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకునేవారు కూడా ఆరోగ్యపరమైన తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment