గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఓ మహిళ ప్రేమ పేరుతో యువకుడిని పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుంచి అందినకాడికి దండుకుంది. తీరా ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటపడడంతో తాను మోసపోయాయని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వెంకటగిరి ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తాను పనిచేసిన ఓ సినిమా షూటింగ్‌లో మహిళా నిర్మాత అతనికి పరిచయం అయ్యింది.
సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం సదరు మహిళా నిర్మాత అతనికి ఫోన్ చేసి డిన్నర్ చేసేందుకు ఇంటికి రావాల్సిందిగా చెప్పింది.ఆ సమయంలో భర్తకు విడాకులు ఇచ్చి పెళ్ళి చేసుకుందామని సదరు మహిళ నాగార్జున బాబుకు చెప్పింది. దీనికి కూడా అతను ఒప్పుకోవడంతో ఇరువురూ చిలుకూరి బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె అతని నుంచి రూ. 18,50,000లను నేరుగా, మరో రూ. 10 లక్షలను ఆమె బ్యాంక్ అకౌంట్‌లోకి వేయించుకుంది.
అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగార్జునబాబు విచారించగా అప్పటికే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయని, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. కానీ తనకు ఒక వివాహం అయ్యిందని, పిల్లలు లేరని చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకుని డబ్బులు కాజేసిందని గ్రహించాడు. అలాగే గతంలో ఆమె పలువురిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. వైజాగ్ గాజువాక పోలీస్ స్టేషన్‌లో భరత్ అనే వ్యక్తిపై, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తిపై, నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కార్తికేయ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. తనను కూడా బ్లాక్‌మెయిల్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందంటూ నాగార్జున జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment