టైటిల్: గల్లీ గ్యాంగ్ స్టార్స్
నటీనటులు : సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తదితరులు
దర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మ
నిర్మాణ సంస్థ: ఏబీడీ ప్రొడక్షన్స్
నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్
సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి
ఎడిటర్ : ధర్మ
అసలు కథేంటంటే..
గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ నెల్లూరు పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు, క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాధల కథే ఈ చిత్రం. ఆ గల్లిని ఎప్పటినుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీషీటర్. అక్కడ ఉన్న అనాధల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్ అమ్మిస్తూ నేరాలు చేయిస్తూ ఉంటాడు. గాంధీ అనే వ్యక్తి గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తూ ఉంటాడు. గాంధీ ప్రియురాలు లక్ష్మీని గోల్డ్ రెడ్డి ఏడిపిస్తాడు. అదేవిధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఈ గల్లీ కుర్రాళ్లకి సత్య అని చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. ఆ తర్వాత గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్ స్టార్స్‌గా ఎలా మారారు? ఈ ఆరుగురు అనాధలు ఎలా కలిశారు? గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే..
డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు కథలోకి నెమ్మదిగా ప్రేక్షకులను తీసుకెళ్లాడు. రోటీన్ వచ్చే సన్నివేశాలు, కామెడీతో హాఫ్ సాగింది. కాస్తా బోరింగ్ అనిపించిన అక్కడక్కడ నవ్వించే సీన్స్‌తో కవర్ చేశాడు. గల్లీ కుర్రాళ్లు, రౌడీషీటర్ గోల్డ్ రెడ్డి మధ్య జరిగే సన్నివేశాల్లో అంతగా వర్కవుట్ కాలేదు.
సెకండాఫ్ వచ్చేసరికి కథను కాస్తా సాగదీసినట్లు అనిపిస్తుంది. గోల్డ్ రెడ్డి, కుర్రాళ్ల గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నారనే దాని చుట్టే కథ తిరుగుతుంది. క్లైమాక్స్ సీన్ ఫర్వాలేదు. డైరెక్టర్ తాను రాసుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో కొత్తదనం చూపించలేకపోయాడు. చివరికీ గోల్డ్ రెడ్డిని ఆ కుర్రాళ్ల గ్యాంగ్ ఎలా ఎదిరించారో తెలియాలంటే గల్లీ గ్యాంగ్ స్టార్స్‌ను చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో కొత్త వారైనా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. సంజయ్ శ్రీ రాజ్ గాంధీగా మంచి పాత్ర పోషించాడు. ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఏబిడి ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ధర్మ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సత్య శరత్ రామ్ రవి సంగీత నేపథ్యం బాగుంది.
Comments
Please login to add a commentAdd a comment