ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, రచయిత వి.మహేశ్ (85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. స్వగృహంలో బాత్ రూమ్ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన మహేశ్‌ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు జిల్లా కొరుటూరు వి.మహేశ్ స్వస్థలం. ‘మాతృమూర్తి’ సినిమాతో సినిమా నిర్మాణంలోకి ప్రవేశించారు మహేశ్.
ఎన్టీ రామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మనుషులంతా ఒక్కటే’, లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్వకత్వంలో ‘సింహపురి సింహం’, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా ‘ముసుగు దొంగ’ వంటి పలు సినిమాలు నిర్మించారాయన. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు వి.మహేశ్. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌లో ప్రసారమైన ‘హరి భక్తుల కథలు’ సీరియల్‌కి ఆయన నిర్మాతగా, రచయితగా వ్యవహరించారు.
అలాగే ‘విప్రనారాయణ’కు 2009లో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారాయన. తన అన్నయ్య, ప్రముఖ కళా దర్శకుడు వి. వి. రాజేంద్ర కుమార్‌తో కలసి సినిమాలకు ప్రచార సామగ్రిని తయారు చేసేందుకు ‘స్టూడియో రూప్ కళ’ అనే సంస్థను, ‘ఆదిత్య చిత్ర ’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు వి. మహేశ్. అయితే ఆయన వివాహం చేసుకోలేదు. వి.మహేశ్ మృతికి సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment