‘‘చిత్రపరిశ్రమలో నా ప్రయాణం బాగానే ఉంది. ఇప్పుడు వరుసగా లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఇప్పటివరకూ కెరీర్‌లో సినిమాపై ఉన్న పిచ్చి, ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు.. అవి నాలో ఉన్నంత కాలం సినిమాలు చేస్తుంటాను’’ అని సత్యదేవ్ అన్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్యదేవ్ చెప్పిన విశేషాలు.
►కొత్త తరహా సినిమా కోరుకునే ప్రేక్షకుల కోసం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చేశాను. ఆ సినిమా తర్వాత నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వైవిధ్యంగా ఉండే ఓ సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలో సృజన్ ఎరబోలు ఫోన్ చేశారు. ఆ తర్వాత శరణ్ కొప్పిశెట్టి వచ్చారు. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కోసం మహేశ్ కోనేరు కూడా జతకలిశారు. కోవిడ్ టైమ్‌లో 39 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో ‘తిమ్మరుసు’ పూర్తి చేశాం.
►లాయర్ కోణం నుంచి సాగే థ్రిల్లర్ చిత్రమిది. ‘అభిలాష’ సినిమాలో చిరంజీవిగారు ఉరిశిక్ష రద్దు కోసం పోరాడితే, ‘తిమ్మరుసు’లో నా పాత్ర యావజ్జీవ కారాగార శిక్ష రద్దు కోసం ఫైట్ చేస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామాతో పాటు యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ‘నాంది, వకీల్‌సాబ్’ వంటి కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడటంతో మా సినిమా విజయంపైనా చాలా నమ్మకంగా ఉన్నాం.
►ఓటీటీల హవా 2023లో స్టార్ట్ అవుతుందనుకున్నాను. అయితే కోవిడ్ వల్ల 2020లోనే స్టార్ట్ అయింది. నా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాలేదనే బాధ ఉండేది.. కానీ మంచి వ్యాపారం జరగడంతో నిర్మాతలు హ్యాపీ. సో.. నేను కూడా హ్యాపీ. కరోనా మొదటి విడత తర్వాత థియేటర్స్‌లో వచ్చిన తెలుగు సినిమాలన్నీ హిట్ సాధించాయి. అదే నమ్మకంతో ‘తిమ్మరుసు’ను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం.
►కోవిడ్ సమయంలో మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ రెండొందల రోజుల్లో ఐదు సినిమాలు పూర్తి చేశా. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉండటంతో ఇతర సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుకోవడం లేదు.. అయితే సమయం కుదిరితే నటిస్తా. ప్రస్తుతం తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం, స్కైలాబ్, గాడ్సే’ చిత్రాలతో పాటు కొరటాల శివగారు సమర్పణలో మరో సినిమా, బాలీవుడ్‌లో ‘రామ సేతు’ సినిమాలు చేస్తున్నాను. ఈ చిత్రాలు వేటికవే విభిన్నంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment