టాలీవుడ్‌కు చెందిన పలు సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించిన శ్రీ రామకృష్ణ (74) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఇతర భాషల నుంచి టాలీవుడ్‌లోకి అనువాదం చెందిన చాలా సినిమాలకు తెలుగులో డైలాగ్స్ అందించిన మాటల రచయితగా శ్రీ రామకృష్ణకు మంచి గుర్తింపు ఉంది. అనారోగ్యంతో గత కొన్నిరోజులుగా చెన్నైలోని తేనపేటలో ఉన్న అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన మరణించారు. శ్రీ రామకృష్ణ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి కాగా 50 ఏళ్ల కిందట సినీ పరిశ్రమ అంతా చెన్నైలోనే ఉండేది. ఈ కారణంగా ఆయన అక్కడే స్థిరపడ్డారు.
బొంబాయి, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్మెన్, చంద్రముఖి తదితర 300కు పైగా చిత్రాలకు ఆయన మాటలు రాశారు. జీన్స్ సినిమా తెరకెక్కించే సమయంలో రామకృష్ణ దగ్గరే కొంతమేరకు తెలుగు నేర్చుకున్నానని బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
మణిరత్నం, శంకర్ వంటి స్టార్ డైరెక్టర్స్ అన్ని సినిమాలకు దాదాపు ఆయనే మాటల రచయితగా పనిచేశారు. రజనీకాంత్ దర్బార్ చిత్రానికి ఆయన చివరగా పనిచేశారు. శ్రీ రామకృష్ణ అంత్యక్రియలు చెన్నై సాలి గ్రామంలోని శ్మశాన వాటికలో నేడు జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment