సురేఖ సిక్రి
ఆమె నానమ్మగా వేసిన ‘బాలికా వధు’ 2248 ఎపిసోడ్స్‌తో దేశంలోనే సుదీర్ఘంగా సాగిన టీవీ సీరియల్‌గా రికార్డు స్థాపించింది. మొన్నటి ‘బధాయి హో’ సినిమాలో 50 ఏళ్ల కోడలు గర్భం దాలిస్తే ఆ కోడలిని అత్తగారి పాత్రలో ఆమె అక్కున చేర్చుకున్న తీరు అద్భుతం. సురేఖ సిక్రి (75) అంటే నాటక, టీవీ, సినిమా రంగంలో ఒక విశిష్టమైన పేరు. ఒక పరంపరకు ప్రతినిధి. సిక్రి శుక్రవారం కన్ను మూసింది. ఆమెకు నివాళి.
దూరదర్శన్‌లో విఖ్యాతమైన ‘తమస్’ సీరియల్‌లో ఒక దృశ్యం.
ఒక వృద్ధ సిక్కు జంట నిలువ నీడ లేక ఒక ఇంటి తలుపు తడుతుంది. ఆ సిక్కు జంటకు ఇల్లు లేదు. దారి లేదు. గమ్యం లేదు. దేశంలో దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఎవరు ఎవరిని హత మారుస్తున్నారో తెలియదు. పోనీ ఎందుకు హతమారుస్తున్నారో తెలియదు. మనిషి కళ్లేలు ఉన్నంత వరకే మనిషి. వదిలితే మృగం. ఆ వృద్ధజంటను గడప దగ్గర చూసిన ‘రాజో’ అనే ముస్లిం మహిళ పాత్రలో ఉన్న సురేఖ సిక్రి ‘మా ఇంట్లో చోటు లేదు వెళ్లండి’ అంటుంది.
వాళ్లు నిరాశతో తిరిగి వెళ్లిపోతుంటే తమాయించుకోలేక ‘ఆశపడి వచ్చారు ఆ పై గదిలో దాక్కోండి’ అని చోటు ఇస్తుంది. అన్నం పెడుతుంది. ‘నా మొగుడికి దేవుడంటే భయం ఉంది. మిమ్మల్ని ఏమి అనడు. కాని నా కొడుకు సంగతి చెప్పలేను’ అని తాపత్రయ పడుతుంది. కొడుకు వస్తాడు. ఈ సిక్కు జంటను చూసి మండిపడతాడు. వాళ్లను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక హృదయమున్న స్త్రీ, సిక్రి, ఊరుకుంటుందా? బెబ్బులిలా తిరగబడుతుంది. ఆ ముసలి జంట పక్షాన నిలుస్తుంది. ఆ సన్నివేశంలో సురేఖా సిక్రి నటన చూడాలి. అలాంటి ఇలాంటి నటన కాదు.
2018లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘బధాయి హో’లో సురేఖ సిక్రి చివరి రోజులలో ఉన్న వృద్ధురాలు. ఇంటి పెద్ద. కొడుకు, కోడలు, వయసొచ్చిన మనవలు... అలాంటి టైమ్‌లో, 50 ఏళ్ల వయసులో కోడలు గర్భం దాల్చిందన్న వార్త ఆమెకు తెలుస్తుంది. ఇదేమి చోద్యం? ఈ వయసు లో. కొడుకును తిట్టిపోస్తుంది. కోడల్ని గదిలో వేసి తాళం పెడుతుంది. అయ్యో.. ఏమి ఖర్మరా అని బాధ పడుతుంది. కాని తల్లి గర్భం దాల్చిందని నామోషీ ఫీలైన పెద్ద కొడుకు ఆమెకు దూరంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకుని, ఒక సహజమైన సహజాతమైన విషయానికి కోడలు మాటలు పడుతోందని సాటి స్త్రీగా అర్థం చేసుకొని తానే మొదట ఆ గర్భాన్ని అంగీకరించి ఆహ్వానిస్తుంది. మన ఇళ్లల్లో కనిపించే వృద్ధుల మనస్తత్వాన్ని, రూపాన్ని, స్వభావాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది సురేఖ సిక్రి ఆ పాత్రలో.
ఏళ్ల తరబడి ‘కలర్స్ టీవీ’లో ఆ తర్వాత డబ్బింగ్ ద్వారా ప్రాంతీయ భాషలలో ప్రసారమైన ‘బాలికా వధు’లో ఆమె నానమ్మ పాత్రలో నటించింది. ఆమె ఆ కథలో ఎంత సేపటికి తన మనవడి పక్షం. అందుకని ఆ మనవణ్ణి చేసుకున్న చిన్నారిని అదలిస్తుంది. బెదిరిస్తుంది. దారికి తేవడానికి చూస్తుంది. కాని కథ గడిచే కొద్దీ మనవడు సరైన వాడు కాదని గ్రహించి చిన్నారి పెళ్లి కూతురుకు పెద్ద సపోర్ట్‌గా మారుతుంది. అంతేకాదు ఆ పెళ్లి కూతురు తన మనవణ్ణి వదిలి మరో కుర్రాణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. సురేఖ సిక్రి పాత్రలు ఇలాంటి పాత్రల వల్ల ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి.
సురేఖ సిక్రీ ఒక కాలంలో వచ్చిన ఉత్తమ నటులు నసీరుద్దిన్ షా, ఓం పురి, రఘువీర్ యాదవ్... వీళ్ల సమకాలికురాలు. అలిగర్‌లో తల్లి టీచర్‌గా పని చేయడం వల్ల అలిగర్ యూనివర్సిటీలో చదువుకుంది. అక్కడే ఉర్దూ కవిత్వం అంటే ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత ఢిల్లీ ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో మూడేళ్ల నటనలో కోర్సు చేసి అక్కడి రెపట్రీలో నాటకాలు వేస్తూ వేయిస్తూ 15 సంవత్సరాలు గడిపింది. ఆ తర్వాత ముంబై వచ్చి సినిమాల్లో పని చేసింది.
‘సలీమ్ లంగ్డే పే మత్ రో’, ‘మమ్నో’, ‘నసీమ్’, ‘సర్దారీ బేగమ్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ అయ్యర్ వంటి సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించింది. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందింది. ‘ఆమె నాటకాలు వేస్తుంటే తొంగి తొంగి చూసి ఆమెలా నటించాలని ఎన్.ఎస్.డిలో నేను అనుకునేదాన్ని’ అని నటి నీనా గుప్తా అంది. వీరిద్దరూ కలిసి ‘బధాయీ హో’లో నటించారు. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమా హీరోయిన్‌గా నటించిన అవికా గోర్ ‘బాలికా వధు’లో చిన్నారి పెళ్లికూతురిగా నటించింది. ‘నా నట జీవితం అటువంటి శిఖరంతో మొదలుకావడం నా అదృష్టం’ అని అవికా గోర్ అంది.
సురేఖ సిక్రికి నటుడు నసీరుద్దిన్ షాకు బంధుత్వం ఉంది. సిక్రి సవతి చెల్లెలు పర్వీన్ మురాద్‌ను నసీరుద్దిన్ మొదటి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి షీబా షా అనే కుమార్తె ఉంది. షీబా షా సురేఖ సిక్రితో కలిసి నటించింది.
‘ఒక మంచి నటికి రెండులైన్ల డైలాగ్ ఉన్న పాత్ర దొరికినా ఆ రెండులైన్లను ఎంత బాగా చెప్పొచ్చు.. ఆ లైన్ల వెనుక కథ ఏమిటి... ఆ లైన్లకు ఎలా న్యాయం చేయాలి... ఇవి ఆలోచించి నటించినట్టయితే తప్పక ఆత్మతృప్తి పొందవచ్చు’ అంటుంది సురేఖ సిక్రి.
కవిత్వం మీద తన అభిమానాన్ని ఉర్దూ స్టూడియో, హిందీ స్టూడియోలలో గొప్ప గొప్ప కవుల కవిత్వాన్ని చదివి రికార్డు చేసి ఆమె మనకు కానుకగా ఇచ్చింది.
భారతీయ నటనా రంగం చూసిన ఒక ఉత్తమ కవిత సురేఖ సిక్రి.
‘బధాయీ హో’లో...
‘తమస్’ సీరియల్‌లో...
‘బాలికా వధు’ సీరియల్‌లో...
Comments
Please login to add a commentAdd a comment