టైటిల్: ట్రూ లవర్
నటీనటులు: మణికందన్.కె, గౌరీ ప్రియా రెడ్డి, కన్నా రవి, హరీశ్ కుమార్, నిఖిల శంకర్ తదితరులు
రచన, దర్వకత్వం: ప్రభు రామ్ వ్యాస్
నిర్మాతలు: హరీష్, యువరాజ్
తెలుగు విడుదల: మారుతి, ఎస్‌కేఎన్
సంగీతం: సీన్ రోల్డన్
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: భరత్ విక్రమన్
విడుదల తేది: ఫిబ్రవరి 10, 2024
కథేంటంటే..
అరుణ్(మణికందన్), దివ్య(గౌరీ ప్రియ) ఇద్దరు కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడతారు. కాలేజీ పూర్తి కాగానే దివ్యకు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. అరుణ్ మాత్రం ఖాలీగా తిరుగుతూ.. కాఫీ కేఫ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తోటి ఉద్యోగులతో క్లోజ్ ఉండడంతో దివ్య ప్రేమ విషయంలో అరుణ్‌కి అభద్రతా భావం కలుగుతుంది. ప్రేమని వదిలి ఆమెను అనుమానించడం మొదలు పెడతాడు. దివ్య తన ఆఫీస్‌లో పని చేసే అబ్బాయిలతో మాట్లాడినా.. ఎక్కడికైనా వెళ్లినా సహించడు. ఆమెతో గొడవపడడం..మళ్లీ సారి చెప్పడం అరుణ్‌కి సర్వసాధారణం అయిపోతుంది. అరుణ్ ప్రవర్తన కారణంగా దివ్యకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అరుణ్ పొసెసివ్‌నెస్ దివ్యకు ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? చివరకు వీళ్లిద్దరు కలిశారా? విడిపోయారా? కేఫ్ పెట్టాలన్న అరుణ్ లక్ష్యం నెరవేరిందా?లేదా? అన్నది మిగతా కథ.
ఎలా ఉందంటే..
అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు. ఒక్కసారి ఒకరిపై అనుమానం మొదలైతే..వాళ్లు ఏం చేసినా అది తప్పులాగే అనిపిస్తుంది. ఇక ఇద్దరి ప్రేమికుల మధ్య ఆవగింజంత అనుమానం ఉన్నా..అది ఆకాశమంత శోకాన్ని మిగులుస్తుంది. అనుమానం, అభద్రతా భావం పెట్టే మానసిక క్షోభ వర్ణణాతీతం. ట్రూ లవర్ కూడా ఓ అనుమానపు ప్రేమ కథే. అనుమానపు ప్రేమ కారణంగా ఓ జంట ఎంత మానసిక సంఘర్షణకు లోనయింది? అనేది ఈ సినిమా కథ. నేటితరం ప్రేమికులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో చాలా నేచురల్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. రొమాన్స్, ఎమోషన్..ఫన్ అన్ని రకాల సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. నేటితరం ప్రేమికుల ఆలోచనా ధోరణికి అద్దం పట్టేలా కథను తీర్చిదిద్దారు. కేవలం ప్రేమ కథనే కాకుండా.. అరుణ్ ఫ్యామిలీ కథను కూడా చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. అక్కడ ఎమోషన్ పండించేందుకు అవకాశం దక్కింది.
అరుణ్, దివ్యల మధ్య ప్రేమ సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు. దివ్య తోటి ఉద్యోగులతో మాట్లాడిన ప్రతిసారి అరుణ్ అనుమానం వ్యక్తం చేయడం..ఇద్దరి మధ్య గొడవలు.. మళ్లీ కలిసిపోవడం.. ఫస్టాఫ్ చాలా వరకు ఇలానే సాగుతుంది. అనుమానం కారణంగా దివ్య నిజాన్ని దాచేయడం.. ఆ విషయం అరుణ్‌కి తెలిస్తే ఎలా ప్రవర్తిస్తాడో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్‌లో చాలావరకు రిపీట్ సన్నివేశాల్లో ఉండడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. అరుణ్ అంత గొడవ చేస్తున్నప్పటికీ దివ్య ఎందుకు అతన్ని భరిస్తుందనే విషయాన్ని బలంగా చూపించలేకపోయాడు. అయితే హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ మాత్రం ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఇంటర్వెల్ సీన్ ద్విదియార్థంపై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో కూడా హీరో హీరోయిన్ల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. అరుణ్ అమ్మ నాన్న రిలేషన్‌లో వచ్చిన సమస్యకి ఈ ప్రేమ కథతో ముడిపెట్టి చెప్పడం బాగుంది. అరుణ్‌కి తన తల్లికి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరోని ఎక్కువగా సిగరేట్ తాగుతూ..లేదా మద్యం సేవిస్తూ చూపించడం ఓ వర్గం ఆడియెన్స్‌కి ఇబ్బంది కలిగించొచ్చు. యూత్‌ని ఆకట్టుకోవడానికే హీరోని అలా చూపించారే తప్ప ఈ కథకు అవసరం లేదనిపిస్తుంది. ఓవరాల్‌గా ట్రూలవర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారికి, బ్రేకప్ అయినవారికి నచ్చే అవకాశం ఉంది. .
ఎవరెలా చేశారంటే..
అరుణ్ పాత్రలో మణికందన్ ఒదిగిపోయాడు. అనుమానపు ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. దివ్య పాత్రకి గౌరీ ప్రియ వంద శాతం న్యాయం చేసింది. తెరపై చాలా అందంగా కనిపించింది. తెరపై మణికందన్, గౌరీ ప్రియల కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. స్నేహితుల పాత్రలు పోషించినవారంతా చక్కగా నటించారు. సాంకెతిక పరంగా సినిమా బాగుంది. సీన్ రోల్డన్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలతో పాటు బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment