
ముఖానికి రంగు పూసుకుని కెమెరా ముందుకు వచ్చి వినోదాన్ని పంచుతారు. కానీ ఆ స్థాయికి రావడం కోసం ఎన్నో కష్టనష్టాలను ఒంటిచేత్తో భరిస్తారు. అలాంటివారిలో బుల్లితెర నటి స్నేహల్ రాయ్ ఒకరు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో దాటుకుని వచ్చిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చింది.
'తొమ్మిదేళ్ల వయసులోనే గృహహింసను కళ్లారా చూశాను. అమ్మానాన్న గొడవపడేవారు. కానీ అమ్మ మాత్రం మనం ఒక ఆట ఆడుతున్నాం.. వెళ్లి కారులో పడుకుందాం అని చెప్పేది. అలా ఖాళీ కడుపుతో కార్లలో నిద్రించిన రోజులు చాలానే ఉన్నాయి. తన ముఖం మీద ఉన్న గాయాల తాలూకు మచ్చలను చిరునవ్వుతో కప్పిపుచ్చేది. నాన్న తనను కొడుతున్నాడని మాకెప్పుడూ అర్థమయ్యేది కాదు. ఆ నరకం నుంచి బయటపడేందుకు అమ్మ ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకుంది.
నన్ను, చెల్లిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసి కొత్త జీవితం మొదలుపెట్టింది. కానీ అప్పుడు మేము పడ్డ కష్టాలను మాటల్లో చెప్పలేను. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేదు. ఓ బస్తీకి వెళ్లి బతికాం. కేవలం పానీపూరి తిని ఆ నీళ్లు ఎక్కువగా తాగి కడుపు నింపుకునేవాళ్లం. ఖాళీ కడుపుతోనే నిద్రపోయేవాళ్లం. ఇదేదో సినిమా కథ అనుకునేరు, ఇది నా జీవితగాథ.
స్కూల్‌కు తరచూ వెళ్లేదాన్ని కాదు. నా పరిస్థితిని వాళ్లు అర్థం చేసుకునేవారు. కానీ తోటి విద్యార్థులు మాత్రం నన్ను ఇష్టపడి స్నేహం చేసేవారు కాదు. 16 ఏళ్ల వయసుకే ఉదయం సెలూన్‌లో రిసెప్షనిస్టుగా, సాయంత్రం కాల్ సెంటర్‌లో పని చేసేదాన్ని. నా తండ్రి మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత తప్పు తెలుసుకుని అమ్మను చేరదీశాడు. అతడు మమ్మల్ని క్షమాపణలు కోరకపోయినా మేమతడిని క్షమించేశాం. మారడానికి ఓ అవకాశం ఇచ్చి చూడాలి కదా..' అని చెప్పుకొచ్చింది నటి స్నేహల్. కాగా స్నేహల్ ఇష్క్ కా రంగ్ సీరియల్‌లో నటించింది. నటిగానే కాకుండా మోడల్‌గా, యాంకర్‌గా రాణిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment