డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాను : ‘మార్కో’ హీరో | Unni Mukundan Interesting Comments About Marco Movie, Deets Inside | Sakshi
Sakshi News home page

డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌ చేశాను : ‘మార్కో’ హీరో

Published Sun, Jan 5 2025 10:26 AM | Last Updated on Sun, Jan 5 2025 1:49 PM

Unni Mukundan Talk About Marco Movie

‘‘మా ‘మార్కో’ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని బలంగా అనుకున్నాను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తారు. ‘బాహుబలి, ఈగ’... ఇలా రాజమౌళిగారు తీసిన హై టైమ్‌ ప్రయోగాత్మక సినిమాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ‘మార్కో’ తరహా సినిమా తీయడానికి ఇది కూడా ఓ స్ఫూర్తి. మా సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని ఉన్ని ముకుందన్‌ అన్నారు.

 ‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌(Unni Mukundan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఉన్ని ముకుందన్‌ హీరోగా టైటిల్‌ రోల్‌లో నటించిన మలయాళ చిత్రం ‘మార్కో’. హనీఫ్‌ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షరీఫ్‌ ముహమ్మద్‌ నిర్మించారు. ఈ చిత్రం మలయాళంలో డిసెంబరు 20న విడుదలైంది. ‘మార్కో’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది. 

ఈ నెల 1న ‘మార్కో’(Marco Movie) సినిమా అదే టైటిల్‌తో తెలుగులో విడు దలైంది. ఎన్వీఆర్‌ సినిమా ‘మార్కో’ మూవీని తెలుగులో రిలీజ్‌ చేసింది. అయితే ‘మార్కో’ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించిందని, తెలుగులో తొలి రోజు హయ్యెస్ట్‌ వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా ‘మార్కో’ నిలిచిందని చిత్రయూనిట్‌ చెబుతోంది. 

ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో ఉన్ని ముకుందన్‌ మాట్లాడుతూ– ‘‘మార్కో’ సినిమాకు హిట్‌ అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిజానికి ‘మార్కో’ విజయాన్ని నేను ఊహించాను. ఎందుకంటే కాలం మారుతోంది. ప్రేక్షకుల అభిరుచులు మారి΄ోయాయి. నిజానికి ఈ సినిమా కోసం మేము ఎంతగానో కష్టపడ్డాం. ఫైట్‌ సీక్వెన్స్‌లు ఎప్పుడూ రిస్క్‌తో కూడుకున్నవే. అయినా నేను ఎలాంటి డూప్స్‌ లేకుండా ఫైట్‌ సీక్వెన్స్‌లు చేశాను. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేప్పుడు నాకు ఏమైనా గాయాలవుతాయా? అని టీమ్‌ అందరూ కంగారు పడ్డారు. ఎందుకంటే అలా జరిగితే షూటింగ్‌ ఆపేయాల్సి వస్తుంది. కానీ అదృష్టవశాత్తు అంతా మంచిగానే జరిగింది. 

ఇక ఈ మూవీలోని మార్కో క్యారెక్టర్‌ కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. క్యారెక్టర్‌కు తగ్గట్లుగా ఫిజికల్‌గా రెడీ కావడం సవాల్‌గా అనిపించింది. మా చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్‌ వచ్చింది. కానీ ఆ ‘ఎ’ సర్టిఫికెట్‌ సినిమాతోనే మేం రూ. వందకోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించగలిగాం. 

యావత్‌ దేశం మా సినిమాను ఆదరిస్తుందనే నమ్మకం మాకు ఉంది. మలయాళం నుంచి తెలుగులో భారీ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాగా ‘మార్కో’ నిలిచింది. దర్శకుడు హనీఫ్‌తో గ్రేట్‌ వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్, కెమెరామేన్‌ చంద్రు, ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్, ఫైట్‌మాస్టర్, కొరియోగ్రాఫర్స్‌... ఇలా టెక్నికల్‌ టీమ్‌ అంతా కూడా కష్టపడ్డారు. వీరందరకీ ధన్యవాదాలు. చాలా హ్యాపీ. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే వెల్లడిస్తాను’’ అని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement