‘ఉరుకు పటేల’ మూవీ రివ్యూ | Uruku Patela Movie Review | Sakshi
Sakshi News home page

‘ఉరుకు పటేల’ మూవీ రివ్యూ

Published Sat, Sep 7 2024 7:33 PM | Last Updated on Sun, Sep 8 2024 12:35 PM

Uruku Patela Movie Review

‘హుషారు’ ఫేమ్‌ తేజస్‌ కంచర్ల హీరోగా, ఖుష్బూ చౌదరి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్‌ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

 కథేంటంటే.. 
పటేల(తేజస్ కంచర్ల) బాగా ఆస్తి ఉంటుంది. కానీ చదువు అబ్బదు. తరగతిలో తనది చివరి ర్యాంకు. దీంతో తోటి విద్యార్థులు అతన్ని చులకగా చూస్తారు. అమ్మాయిలు అయితే.. తనవైపే చూడడానికి ఇష్టపడరు. దీంతో పెద్దయిన తర్వాత ఎలాగైన బాగా చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోతాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదివిన పటేల.. ఊర్లో బార్‌ నడుపుతూ సర్పంచ్‌ అయిన తన తండ్రి(గోపరాజు రమణ)కు రాజకీయంగా తోడుగా ఉంటాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటే.. ఆ ఊరివాళ్లు ఎవ్వరూ పిల్లను ఇవ్వడానికి ముందుకు రారు. అయితే పక్క ఊరికి చెందిన డాక్టర్‌ అక్షర(ఖుష్బూ చౌదరి ) మాత్రం పటేల్‌ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ఏడో తరగతి వరకు మాత్రమే చదివి జులాయిగా తిరుగుతున్న పటేలాను డాక్టర్‌ అయిన అక్షర ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది? నిజంగానే పటేలాను అక్షర ప్రేమించిందా? అక్షర బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ కోసం ఆస్పత్రికి వెళ్లిన పటేలాకు ఎదురైన అనుభవం ఏంటి? అక్షర ఫ్యామిలీ చేసిన కుట్ర ఏంటి? అసలు పటేలా ఎందుకు పరుగెత్తాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఈ టెక్నాలజీ యుగంలోనూ మూఢ నమ్మకాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. మంచి జరుగుతుందని నమ్మి నరబలి ఇవ్వడానికి చూడా వెనుకాడడం లేదు. తరచు మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. అలాంటి వాటిని బేస్‌ చేసుకొని తెరకెక్కించిన చిత్రమే ఉరుకు పటేలా. థ్రిల్లర్‌ కామెడీ జోనర్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వివేక్ రెడ్డి . ఆయన ఎంచుకున్న పాయింట్‌ బాగుంది కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంతో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. ప్రీ ఇంటర్వెల్‌ వరకు కథనం నార్మల్‌గా సాగుతుంది. అయితే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆస్తకి పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకోవడమే కాదు.. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తుంది. అయితే కథనం మొత్తం ఒక ఆస్పత్రి చుట్టే సాగడం.. ఈ కమ్రంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో వచ్చే ట్విస్ట్‌ ఊహించని విధంగా ఉంటుంది. కథను మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఎవరెలా చేశారంటే.. 
పటేలా పాత్రలో తేజస్ కంచర్ల ఒదిగిపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో థ్రిల్లర్ జోనర్ లో తను ఇరుక్కుపోయిన ప్లేస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని భయపడే పాత్రలో అదరగొట్టేసాడు. ఉరుకు పటేల సినిమాని తన భుజాలమీదే మొత్తం నడిపించాడు. ఓవైపు భయపడుతూనే... మరోవైపు కామెడీ పండించాడు. డ్యాన్స్‌ కూడా బాగా చేశాడు. కొన్ని చోట్ల ఆయన పాత్ర డీజే టిల్లుని గుర్తు చేస్తుంది.

ఇక డాక్టర్‌ అక్షరగా కుష్భు చౌదరి తన అందంతో చాలా క్యూట్ గా మెప్పించింది. సెకెండాఫ్ లో వచ్చే ఆమెలోని మరోకోణం నటనతో ఆకట్టుకుంది. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా కనిపించి అలరించింది. ఇక మరో పాత్రలో హీరోయిన్ వదిన పాత్ర వేసిన లావణ్య రెడ్డి కూడా ఆకట్టుకుంటుంది. గ్రామ సర్పంచ్‌,  పటేల తండ్రి పాత్రలో గోపరాజు రమణ ఎప్పటిలాగే తనమార్క్ డైలాగులు, నటనతో మెప్పంచారు. సుదర్శన్ తో డబుల్ మీనింగ్ డైలాగులతో కాస్త శ్రుతిమించే చెప్పించారు.  చమ్మక్ చంద్ర పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది.

మూఢనమ్మకాలతో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ ఈ కథను అల్లుకుని... థ్రిల్లర్, కామెడీ జానర్లో చాలా ఆసక్తికరంగా ఎంటర్టైన్మెంట్‌గా మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఈ చిత్రం ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే జత చేసి మొదటి సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వివేక్. మూవీలో  సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం రాత్రి పూట ఒకే హాస్పిటల్ లో కథ జరగడంతో దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఈ వారం వినాయకచవితి సందర్భంగా వచ్చిన హాలీడేస్ ను ఈ సినిమాతో ఎంజాయ్ చేసేయండి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement